Andhra Pradesh : నెల్లూరు (Nellore) జిల్లాలో వైసీపీ (YSRCP)కి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 10 సీట్లకు పదింట గెలుపొందింది. పార్లమెంట్ సీటును తన ఖాతాలో వేసుకుంది. ఐదేళ్లు తిరిగే సరికి పరిస్థితులు రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక వైసీపీ నేతలు...ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి (Anam RamNarayana Reddy)ని పార్టీ వీడారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy) పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరం కావడం ఖాయమైంది. ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడనున్నారనే సమాచారం రావడంతో నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతలు.. కార్యకర్తలు డీలా పడ్డారు. ప్రభాకర్ రెడ్డి లేని లోటును భర్తీ చేసేందుకు వైసీపీలోని సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 


2019లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకున్న వేమిరెడ్డి
2019 ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివిధ జిల్లాలను పర్యవేక్షించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత...వేమిరెడ్డి కీలక నేతగా ఎదిగారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి టీటీడీ సభ్యురాలిగా అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ఆధ్యాత్మికత, భక్తిభావం అధికంగా ఉన్న వేమిరెడ్డి దంపతులు...పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాకానికి మంత్రిగా ప్రమోషన్ లభించడంతో...జిల్లాలో పార్టీని నడిపించే బాధ్యతను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అప్పగించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేయాలని సీఎం జగన్ కోరడంతో అంగీకరించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసిన వేమిరెడ్డి... నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి  నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి తెలియజేశారు. వేమిరెడ్డి ప్రతిపాదనలకు అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. అసంతృప్తి చెందిన ఆయన..కొంతకాలం పాటు పార్టీకి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వేమిరెడ్డి పార్టీని వీడుతారన్న వార్తలతో విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చర్చలు జరిపారు.  


సీఎం జగన్ హామీ ఇచ్చినా నో అన్న వేమిరెడ్డి
అభ్యర్థుల బలంగా ఉన్నారని, ఎంపీగా ఈజీ గెలవొచ్చని సీఎం జగన్‌...వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెప్పారు. కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ తో పాటు మరో బీసీ నేత పేరును తెర పైకి తీసుకువచ్చారు. తన  లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల గురించి సమాచారం ఇవ్వకపోవడంపై వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. కందుకూరులో మాజీ మంత్రి మహీధర్ రెడ్డినే కొనసాగించాలని చెప్పినా పట్టించుకోలేదు. తాను కోరిన విధంగా అనిల్‌ కుమార్ ను మార్చడంతో సంతృప్తి చెందిన వేమిరెడ్డి....నెల్లూరు సిటీలో గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని భావించారు. మాజీ మంత్రి నారాయణకు పోటీగా బలహీనమైన అభ్యర్థిని దించితే వైసిపికి ఓట్లు తగ్గుతాయని, దాని ప్రభావం వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిపైన ఉంటుందని అనిల్ వర్గం ప్రచారం చేయడాన్ని వేమిరెడ్డి తట్టుకోలేకపోయారు. కందుకూరు అభ్యర్థిగా వంకి పెంచలయ్య యాదవ్  పేరును అధిష్టానం ప్రతిపాదించింది. తర్వాత పెంచలయ్య లేదా అతని కుమార్తె  కందుకూరు నుంచి పోటీ చేస్తారని కూడా లీకులు ఇవ్వడంపై వేమిరెడ్డి రగిలిపోయారు. వైసీపీకి పిపిఆర్ దూరమవుతారనే సమాచారం తెలియడంతో టిడిపి నేత మాజీ మంత్రి నారాయణ హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లి... వి.పి.ఆర్.తో భేటీ అయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నారాయణ...వేమిరెడ్డితో చర్చలు జరపడంతో టీడీపీలో చేరేందుకు ఒకే చెప్పారు.