High School Students Fell Ill Due To Food Poison In Narayanpet District: నారాయణపేట జిల్లాలోని (Narayanapeta District) ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మాగనూరు (Maganuru High School) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స అందించి వారిని ఇళ్లకు పంపించారు. 9 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరికొంత మందికి పాఠశాల వద్దే వైద్యుడి సమక్షంలోనే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై సిబ్బంది, ఉపాధ్యాయులను ఆరా తీశారు.


సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం


ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదిక అందజేయాలని సీఎంవో అధికారులకు నిర్దేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు.


మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం


అటు, ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇవి గురుకులాలా లేక నరక కూపాలా?. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోంది. బుధవారం నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతోంది. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారూ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది.?. మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?. ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.' అని హరీష్‌రావు పేర్కొన్నారు.


Also Read: CM Revanth Reddy: 'వేములవాడ రాజన్ననూ కేసీఆర్ మోసం చేశారు' - 50 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా సారీ చెబుతానన్న సీఎం రేవంత్ రెడ్డి