Sri Ram Sagar Project: గోదావరి పరీవాహకంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం 47 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. విద్యుదుత్పత్తి అనంతరం 3 వేల క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 3,583 క్యూసెక్కులు, కాలువలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కడెం ప్రాజెక్టుకు కూడా వరద నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 18 వేల క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 9 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 36 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. దిగువకు అంతే పరిమాణంలో 36 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
కృష్ణానది వెలవెల
కృష్ణా పరీవాహకంలో వర్షాలు కురవడం లేదు. ఫలితంగా కృష్ణానది ఒట్టిపోయినట్లు దర్శనమిస్తోంది. కేవలం జూరాల వద్ద స్వల్పంగా ఇన్‌ఫ్లో ఉంటోంది. 2,503 క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్ట్‌కు చేరుతోంది. ఇక్కడి నుంచి కాలువలకు 4,173 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పరిస్థితి కూడా ఇంతే. వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో లేదు. కాలువలకు 10,475 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి చుక్కనీరు రావడం లేదు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి చేసి 1,163 క్యూసెక్కులు సాగర్ వైపు వదులుతోంది. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైపు పోతిరెడ్డిపాడుకు తొమ్మిది వేల క్యూసెక్కులు, హంద్రీనీవా పథకానికి 1,857 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 490 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి ఆవిరి నష్టాలతో కలిపి అవుట్‌ఫ్లో 13,516 క్యూసెక్కులుగా ఉంటోంది. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి 8,296 క్యూసెక్కులు వస్తుండగా డ్యాం దిగువ నుంచి ఎగువకు రివర్స్ పంపింగ్ ద్వారా 3,472 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ఫలితంగా మొత్తం ఇన్‌ఫ్లో 11,768 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 4,902 క్యూసెక్కులు, శ్రీశైలం ఎడమ బ్రాంచి కాలువకు 450 క్యూసెక్కులు వదులుతున్నారు. కృష్ణానది, గోదావరి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తప్ప రెండు నదుల్లో ఇన్‌ఫ్లో వచ్చే పరిస్థితి లేదు.
కృష్ణా నది పరివాహకంలో..
ఆల్మట్టి డ్యాంకు ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులు వస్తుండగా అంతే పరిమాణంలో కిందకు వదులుతున్నారు. నారాయణపూర్‌కు ఇన్‌ఫ్లో లేకపోగా 9886 క్యూసెక్కులు బయటకు వదులుతున్నారు. జూరాలకు 2503 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. 4,285 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. తుంగభద్రకు కేవలం 706 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 10,475 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలంకు ఇన్‌ఫ్లో లేదు, అయినా 13,516 క్యూసెక్కులు వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. నాగార్జున సాగర్‌కు 11,768 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. 5,414 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు ఇన్‌ఫ్లో లేదు. 5000 క్యూసెక్కులు కిందకు విడుదల చేస్తున్నారు.
గోదావరి పరివాహకంలో..
సింగూరు ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 0 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 705 క్యూసెక్కులుగా ఉంది. నిజాంసాగర్‌కు 669 క్యూసెక్కులు వస్తుండగా కిందకు ఏమీ వదలట్లేదు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు 47,547 క్యూసెక్కులు వస్తుంగా 9,330 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మిడ్ మానేరుకు 2205 క్యూసెక్కులు వస్తోంది. 1211 క్యూసెక్కులు వదిలిపెడతున్నారు. దిగువ మానేరుకు 1,435 క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,789 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 68,402 క్యూసెక్కులు వస్తుంటే కిందకు అంతే మొత్తంలో వదిలిపెడుతున్నారు.