TS Phone Tapping   :   తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని దర్యాప్తు చేయించాలని ఎన్నికల సంఘానికి  తంగేళ్ల శివ ప్రసాద్‌రెడ్డి  అనే బీజేపీ నేత ఫిర్యాదు చేశారు.  ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్‌లను తెలంగాణ సర్కార్‌ ట్యాప్ చేస్తోందని తాను ఇచ్చిన ఫిర్యాదులో శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.  ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5(2) నిబంధనల్లో ఫోన్ ట్యాప్ చేయడం విరుద్ధమని శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. గత వారం మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో రెండు ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. అయితే పోలీసులు వీటిని కోర్టుకు ఆధారాలుగా సమర్పించలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే రిలీజ్ చేశారు.


ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ నేతల ఫిర్యాదులు


దీంతో భారతీయ జనతా పార్టీ నేతలు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్‌ చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తోందని.. బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా సేకరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో దుబ్బాక ఉపఎన్నికల సమయంలోనూ .. తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని.. ఆయన హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అయితే ఈ లేఖలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్యాపింగ్‌పై విచారణ జరగలేదు. ఇప్పుడు తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. విచారణకు ఆదేశిస్తుందా లేదా అన్న నిర్ణయం వెలువడిన తర్వాత కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 


హైకోర్టులోనూ కేసు వేసేందుకు ప్రయత్నాలు


మరో వైపు ఇదే విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని తంగెళ్ల శివప్రసాద్ రెడ్డి భావిస్తున్నారు. ఫామ్ హౌస్ కేసులో నిందితులవి అంటూ టీఆర్ఎస్ పార్టీ లీక్ చేసిన ఆడియోలు ట్యాపింగ్ చేసినవని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా సందిగ్ధం ఉంది. ట్రాప్ చేశామని కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు కానీ ఆ వీడియోలు, ఆడియోలు ప్రవేశ పెట్టలేదు. టెక్నికల్ ఎవిడెన్స్ కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే ఈ లోపే సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో ఈ ఆడియో టే్పులో కోర్టులో చెల్లుతాయా లేదా అనేదానిపై సందిగ్ధం ఏర్పడింది. అదే సమయంలో ఫామ్ హౌస్‌లో దొరికాయని ప్రచారం జరిగిన రూ. కోట్ల సొమ్ము కూడా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. అసలు సొమ్ము స్వాధీనం చేసుకున్నామని కూడా పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. 


లీక్ అయిన ఆడియోలు అనధికారికమే 


ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధం. గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వాలు రాజీనామాలు చేశాయి. అయితే టెక్నాలజీ బాగా పెరిగిపోయిన పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం ఈజీ అయిపోయింది. పెగాసస్ లాంటి అత్యాధునిక సాఫ్ట్ వేర్లతో అధికారంలో ఉన్న వారు విపక్షాలపై నిఘా పెడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొన్ని అనుమానాలను బలపర్చే ఆడియోలు.. బయటకు రావడం ... ఫిర్యాదులకు కారణం అవుతోంది.