TDP Shocks - Lover Rock  :   తమ బిడ్డను ప్రేమ పేరుతో తీసుకెళ్లి హత్య చేశారని న్యాయం జరిగేలా పోరాటం చేయాలని ఓ యువతి తల్లిదండ్రులు టీడీపీ నేతల వద్దకు వచ్చి వేడుకున్నారు. ఇలాంటి సమస్యలపై పోరాటం కోసమే తామున్నామని టీడీపీ నేతలు.. వారితో కలిసి జనసేన నేతలు రోడ్డెక్కారు. కానీ వారు అనుకున్నది ఒకటి.. అయితే జరిగింది  మరొకటి. దీంతో టీడీపీ, జనసేన నేతలు షాక్‌కు గురి కావాల్సి వచ్చింది. అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 


9 నెలల కిందట లవర్‌తో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న శ్రీకాళహస్తికి చెందిన చంద్రితా ! 


శ్రీకాళహస్తి పట్టణంలోని మంచినీళ్ళ గుంటకు చెందిన చంద్రితా అనే యువతి తొమ్మిది నెలల క్రితం శ్రీకాళహస్తి పట్టణంకు సమీపంలోని రామాపురంకు చేందిన చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.. ఇరువురిది కులంతర వివాహం కావడంతో తమ ప్రేమ పెళ్ళి అడ్డుపడతారని ఊహించిన ప్రేమజంట అజ్ఞాతంలోకి వెళ్ళి పోయింది.. అయితే చంద్రిత తల్లిదండ్రులు తమ కుమార్తే కనిపించడం లేదంటూ అప్పట్లో నెల్లూరు జిల్లాలోని దొరవారిసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు యువతి కోసం పలు ప్రాంతాలు గాలించారు.. యువతికి సన్నిహితంగా ఉన్న వారిని విచారించారు.. ఎవరికి ఎటువంటి సమాచారం లేక పోవడంతో పోలీసులు తమ స్టైల్ లో దర్యాప్తు సాగించారు. 


పది రోజుల కిందట కేవీబీ పురం దగ్గర గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం !


చివరికి ఈ నెల 20వ తేదీ గుర్తు తెలియని యువతీ మృతదేహం కేవీబి పురం పరిధిలో బయటపడింది.  అది తమ బిడ్డ చంద్రితాది అని రామాపురంకు చెందిన వాలంటీర్ చంద్రశేఖర్ తమ కుమార్తెను చంపేశాడని తమకు  న్యాయం చేయాలంటూ చంద్రిత తల్లిదండ్రులు టిడిపి నాయకులను ఆశ్రయించారు.. ఇదే విషయం తెలుసుకున్న జనసేన నాయకులు టిడిపి నాయకులతో కలిసి ధర్నాలు, నిరసనలతో  శ్రీకాళహస్తి పట్టణం వారం రోజులుగా దద్ధరిల్లి పోయింది.. స్ధానిక వైసీపి ఎమ్మెల్యేపై టిడిపి, జనసేన నాయకులు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. 


తాను బతికే ఉన్నానని సెల్ఫీ వీడియో పంపిన చంద్రితా !


తాను చనిపోయానని.. తనను తన భర్త చంద్రశేఖర్ చంపేశారని శీకాళహస్తిలో రాజకీయ ఆందోళనలు జరుగుతూండటంతో  చంద్రశేఖర్, చంద్రితలు తాము క్షేమంగా ఉన్నామని సెల్ఫీ వీడియో పంపారు.  మేము క్షేమంగా ఉన్నాం, మాకోసం ఎవరూ గాలించకండి, మా పై అనవసరంగా నిందకు వేసి రాజకీయం చేయకండి అంటూ చెప్తూ, తమ క్షేమ సమాచారంను తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు తమ పోరాటం అంతా వృధా పోయిందని నిట్టూర్చారు. చంద్రితా తల్లిదండ్రులకూ ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. అయితే ఈ ఆందోళనల వారికీ క్షేమ సమాచారం తెలిసిందని వారూ నిట్టూర్చారు. 


గుర్తు తెలియని మృతదేహం ఎవరిది ? 
 
న్యాయం జరిగే వరకూ తగ్గేదేలే అంటూ యువతి తల్లిదండ్రులు కూడా ధర్నాలు చేశారు.  పోలీసులు గుర్తు తెలియని మృతదేహం చంద్రితది నిర్ధారణ కాలేదని పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకూవేచి చూడాలని   నచ్చజెప్పినా టిడిపి,జనసేన నాయకులు వినలేదు. యువతి తల్లిదండ్రులు.. అది తమ అమ్మాయి మృతదేహమేనని గట్టిగా చెప్పడంతో టీడీపీ, జనసేన నేతలు వారికి అండగా నిలబడి పోరాటం చేశారు. అయితే ఆ మృతదేహం ఎవరిది అన్నదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


టీడీపీ, జనసేన నేతలకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ప్రదర్శలు


ఆధారాలు లేకుండా చంద్రితా భర్త చంద్రశేఖర్‌పై నిందలు వేశారని..  టీడీపీ, జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కాళహస్తిలో ప్రదర్శనలు నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.