Elon Musk on Layoffs:
స్పష్టతనిచ్చిన మస్క్..
ట్విటర్‌లో భారీగా సిబ్బంది కోత ఉంటుందన్న వార్తలు రెండ్రోజులుగా వినిపిస్తున్నాయి. స్వయంగా ఎలన్ మస్క్ ఓ సందర్భంలో ఇది చెప్పారని అంతర్జాతీయ మీడియా చెప్పింది కూడా. ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనం బాగా పాపులర్ అయింది. దీనిపై పెద్ద చర్చ జరుగుతుండగానే...ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ఈ వార్తలు అవాస్తవం అని కొట్టి పారేశారు. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తను కోట్ చేస్తూ ఓ నెటిజన్ మస్క్‌ను ప్రశ్నించగా..."ఇది పూర్తిగా అవాస్తవం" అని ట్వీట్ చేశారు. అంతకు ముందు రోజు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం రాసింది. కంపెనీలో పెద్ద ఎత్తున లేఆఫ్‌లు చేపట్టాలని మస్క్ ఆదేశాలిచ్చినట్టు వెల్లడించింది. నవంబర్ 1వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తవ్వాలని చెప్పినట్టూ రాసింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు స్టాక్ గ్రాంట్స్ కూడా అప్పగించనున్నట్టు తెలిపింది. ఇప్పుడు దీనిపైనే ఎలన్ మస్క్ స్పష్టతనిచ్చారు. అలాంటిదేమీ లేదని, ఇదంతా నిజం కాదని తేల్చి చెప్పారు.
పాలసీలో మార్పులు..
ట్విటర్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన...ట్విటర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి. భారీ ఎత్తున "లే ఆఫ్‌లు"ఉండొచ్చన్న సంకేతాలిచ్చినట్టు కొందరు ధ్రువీకరించారు. డీల్ పూర్తైన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని మస్క్ ముందుగానే అనుకున్నారని, అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పావులు కదుపుతున్నట్టు చెప్పారు. వీలైనంత వరకూ మ్యాన్ పవర్‌ను తగ్గించే పనిలో పడ్డారని వివరించారు. ఇదంతా ఇప్పుడు అవాస్తవం అని తేలింది. కంపెనీలో ఎన్నో మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు మస్క్. విధానాల్లో మార్పులు లేకపోయినా...వాటిలో సంస్కరణలు చేపట్టాలని చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న వారిని తొలగించిన తరవాతే ఈ ప్రక్షాళన మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే..కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్‌ను తొలగించారు మస్క్. తరవాత ఆయన "Content Moderation Policy"పై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా మస్క్ ఓ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా Content Moderation Councilని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు
చెప్పారు. Restricted Accountsకి సంబంధించి తుది నిర్ణయమూ తీసుకుంటారు. నిజానికి...ట్విటర్‌లో భారీ లేఆఫ్స్ ఉండనున్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ కంపెనీ మస్క్ హస్తగతమయ్యాక...దీనిపై స్పష్టత వచ్చింది. అంత భారీ మొత్తంలో ఉద్యోగాల కోత ఏమీ ఉండదని ఇప్పటికే ట్విటర్ అంతర్గత వర్గాలు చెప్పిన...ఉద్యోగుల్లో ఆ భయం మాత్రం పోలేదు. ఓ ఉన్నతాధికారి దీనిపై స్పందించి ఉద్యోగులకు మెయిల్ కూడా పంపారు. ఆ స్థాయిలో లేఆఫ్‌లు ఉండవని తేల్చి చెప్పారు. ఇప్పుడు మస్క్ ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.