Telangana: అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే  అక్క చెల్లెల్లు సోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తారు. కానీ ఉన్న ఒక్కగానొక్క సోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా, సోదరుని సమాధి వద్ద సోదరుని ప్రతిరూపంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రతి ఏటా రాఖీలు కడుతూ తమ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఆ అక్క చెల్లెళ్లు. 


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గూగులోతు లింగయ్య, సత్తవ్వలకు ముగ్గురు కుమార్తెలు రాజమ్మ, బులమ్మ, శ్రీలత.  ఒక్కగానొక్క కొడుకు నరసింహ నాయక్. అతడు సైన్యంలో చేరి సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహించేవాడు. 2014లో చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ అమర్చిన మందు పాతర పేలి వీరమరణం చెందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా నరసింహ నాయక్ సమాధి వద్ద ఏర్పాటుచేసిన విగ్రహానికి అక్కాచెల్లెళ్లు రాఖీలు కడుతూ, విగ్రహంలో తమ సోదరుడ్ని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


రాఖీ పండుగ వచ్చిందంటే నరసింహ నాయక్ అక్క చెల్లెళ్లకు కన్నీరే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన సహాయం అందిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు తమ కుటుంబానికి ఏ విధమైన సహాయం చేయలేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ వీర జవాన్ నరసింహనాయక్ పేరు మీద తండాకు బీటీ రోడ్డు, గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే చదువుకున్న నరసింహ నాయక్ చెల్లెలు శ్రీలతకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఈ హామీలు నెరవేర్చలేదని నరసింహనాయక్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.


పెద్దపల్లి జిల్లాలో విషాదం, అన్న మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు
రాఖీ పండగ వారి ఇంట విషాదం నింపింది. అన్నా చెల్లెల్ల అనుబంధానికి, అక్క, తమ్ముడి ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే పండుగ వారి ఇంట్లో మాత్రం తీరని వేదనను మిగిల్చింది. రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లిని చూసి ఓ అన్న గుండె పోటుతో కన్నుమూశాడు. ఆ చెల్లి తన అన్న మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించింది. అప్పటి దాకా ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో అంతలోనే అంతులేని శోకం మిగిలింది. ఈ హృదయ విదారక ఘటన పెద్ద పల్లి జిల్లాలో జరిగింది. 


పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. పండుగ రోజు కుటుంబం మొత్తం సంతోషంగా గడిపింది. ఇంతలో కనకయ్య ఒక్కసారిగా పడిపోయాడు. కుటుంబ సభ్యులు కనకయ్యను పైకి తీయగా నిర్జీవంగా కనిపించాడు. గుండెపోటుతో చనిపోయాడని తెలుసుకుని ఆ కుటుంబం విలపించింది. దీంతో ఆయన మృతదేహానికే సోదరి గౌరమ్మ రాఖీ కట్టి బోరున విలపించింది. ఇక నుంచి ఎవరికి రాఖీ కట్టాలని, తన కష్టసుఖాలు ఎవరికి చెప్పుకోవాలంటూ గౌరమ్మ కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ ఘటన గ్రామం మొత్తాన్ని కన్నీరు పెట్టించింది.