Husnabad Tension : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులైన గుడాటిపల్లి వాసులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఇందుకు నిరసనగా మంగళవారం ఉదయం నుంచి హుస్నాబాద్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు భూనిర్వాసితులు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. హుస్నాబాద్‌ మల్లెచెట్టు చౌరస్తాలో నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఈ ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులు టీఆర్ఎస్ జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలపై దాడికి పాల్పడడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంలా మారిపోయింది. ఓ దశలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 


గ్రామస్థులపై పోలీసుల లాఠీఛార్జ్! 


ఎమ్మెల్యే వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతోందని భూ నిర్వాసితులు స్పష్టంచేశారు. నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నా తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ- హుస్నాబాద్‌ ప్రధాన రహదారిపై ఆందోళనకారులు వంటా వార్పు, రాస్తారోకో నిర్వహించారు. తమకు పరిహారం ఇవ్వకుండా సర్వే చేయడానికి వీల్లేదని గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులను కట్టడిచేసేందుకు పోలీసులు దారుణంగా వ్యవహిరంచారు. గ్రామంలో విద్యుత్ నిలిపివేసి అర్ధరాత్రి ఇళ్లలోకి ప్రవేశించి ఆందోళనకారుల్లో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. మహిళలని కూడా చూడకుండా అడ్డుకున్న వారిపై లాఠీఛార్జ్ చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 


అర్ధరాత్రి ఇళ్లలో చోరబడి పోలీసుల బలప్రయోగం! 


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రిజర్వాయర్ కారణంగా ముంపునకు గురవుతున్న గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. పోలీసుల లాఠీఛార్జ్ లో పలువురు గాయపడ్డారు. పోలీసుల నిర్బంధాలు, నిర్వాసితుల ఆందోళనల మధ్య సోమవారం నీటిపారుదలశాఖ సర్వే పనులు చేపట్టింది. భూములు కోల్పోతున్న నిర్వాసితులపై జరిగిన పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్‌ నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, హుస్నాబాద్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పద్మ తదితరులు భూనిర్వాసితులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.


Also Read : Basara IIIT Students Protest : బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్, బీజేపీ నేతలు అరెస్టు


Also Read : Revanth Reddy On Undavalli : కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు