Basara IIIT Students Protest : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ట్రిపుల్ ఐటీ వద్ద NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ ఆందోళన చేశారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, తాగునీటి సమస్య ఉందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అన్నారు వెంకట్. ఐఐఐటీలో విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. కాలేజీలో రెగ్యులర్ వీసీ నియమించాలని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వెంకట్.


బీజేపీ నాయకుల ఆందోళన 


మరోవైవు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద బీజేపీ నాయకులు సైతం నిరసనకు దిగారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భోజనం, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని ప్రధాన గేటు ముందు ధర్నాకు దిగారు బీజేపీ నాయకులు. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని విద్యార్థులకు న్యాయం చేయకపోతే  పెద్ద ఎత్తున ధర్నా  చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు భోజనం, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 


అసలేం జరిగింది?


బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరిస్తామోనని వేచి చూసి చూసి ఇక సహనం కోల్పోయి పోరు బాట పట్టారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నిరాహార దీక్ష చేపట్టారు.  బాసర ట్రిపుల్ ఐటీ న్యాక్ హోదాలో వెనకబడిపోయిందని, తమ గోడును వినే నాథుడే లేడని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.  విద్యార్థులు టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. ఈ నిరాహార దీక్షలో ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో.. తల్లిదండ్రులు భారీగా బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు తరలి వచ్చారు. 


విద్యార్థుల తల్లిదండ్రులను  ట్రిపుల్ ఐటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.  ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని, సీఎం కేసీఆర్ ఆర్జీయూకేటీని సందర్శించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.   రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించడంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన నినాదాలతో  హోరెత్తించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు   విద్యార్థులు ధర్నా చేశారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంటల తరబడి నిరసన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులుయూనివర్సిటీని సందర్శించే వరకు ధర్నా ఆపేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. యూనివర్సిటీలో పూర్తిస్థాయి వైస్ ఛాన్స్లర్ ను నియమించాలని, ల్యాబ్ ట్యాప్ లను అందించాలని, మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని విద్యార్థుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.