Revanth Reddy On KCR Undavalli Meet : కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు నిరసనగా రెండో రోజు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు బైఠాయించాయి. ఈ నిరసన కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి...దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం అప్పుల కారణం ఆ పత్రిక మూతపడిందని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ భావాజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ కు కాంగ్రెస్ ఊపిరి పోసి మళ్లీ ప్రారంభించింది. లాభాపేక్ష లేని యంగ్ ఇండియా సంస్థలు ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేదన్నారు. బీజేపీ దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందనే కారణంతోనే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్లినా మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులలో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ స్పష్టం చేశారు.
బీజేపీకి భయం పట్టుకుంది
300 సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. తక్షణమే ఈడీ కేసును ఉపసంహరించుకొని బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీరు మారకుంటే.. ఈ నెల 23న దిల్లీలో ఉన్న ఈడీ ఆఫీస్ ను తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారన్నారు.
ఉండవల్లి-కేసీఆర్ భేటి పై రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర సిద్ధాంతం కోసం పోరాడారనే గౌరవం ఆయనపై ఉండేదన్నారు. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో గానీ, కేసీఆర్ పంచన చేరి, ఉండవల్లి కేసీఆర్ భజన చేయడంతో తెలంగాణ ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవం పోయిందన్నారు. కేసీఆర్ బీజేపీపై పోరాడితే, కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారన్న రేవంత్ రెడ్డి.. ఆ రెండు పుస్తకాలలో తెలంగాణ ఏర్పాటునే తప్పు బట్టారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ను ఉండవల్లి విమర్శించారన్నారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ ఇంటికి పిలిచి కలిసి పనిచేయమంటరా అని నిలదీశారు. సార పాతదే సీత కొత్తది అన్నట్లు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తారట అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లాంతా.. బీహార్ వాళ్లే అని ఆరోపించారు. అది టీఆర్ఎస్ కాదని అది బీహార్ రాష్ట్ర సమితి అని విమర్శించారు. ఉండవల్లి అడ్డా మీద కూలిగా మారి కేసీఆర్ తో కలవద్దు అని సూచించారు. తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు.