సిద్దిపేట జిల్లా కలెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సోమవారం జిల్లాలో జరిగిన అగ్రికల్చర్ మీటింగ్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తనాలు సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఒకవేళ ఎవరైనా వ్యాపారులు వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారి షాపులు సీజ్ చేస్తానని, భవిష్యత్తులో ఏ పని చేసుకోనివ్వకుండా వెంటాడతానని హెచ్చరించారు. తాను కలెక్టర్‌గా ఉన్నంత కాలం అదే జరుగుతుందని తేల్చి చెప్పారు. షాపును తిరిగి తెరవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుుల చెప్పినా తాను విననని అన్నారు. డీలర్లు కనుక ఒకవేళ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారని హెచ్చరించారు. దీంతో కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతోంది.
సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి విత్తనాలు అమ్మవద్దని ప్రభుత్వమే బ్లాక్ మెయిల్ చేయిస్తోందని ఆరోపించారు. ‘‘రైతుల ధాన్యం సేకరణ బాధ్యత నుంచి చేతులెత్తేసేందుకు ప్రభుత్వం ఎత్తుగడ. వరి పండించే అవకాశం లేనప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులపై వెచ్చించడం దేనికి!?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
Also Read: ఏపీలో టీఆర్ఎస్ పోటీ ! ఆషామాషీగా కాదు వ్యూహాత్మకంగానే కేసీఆర్ అడుగులు !
షాపులను సీజ్ చేస్తామని సిద్దిపేట కలెక్టర్.. డీలర్లను, వ్యవసాయ అధికారులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా షాపులను తెరవనని తెగేసి చెప్పారంటే.. అత్యున్నత న్యాయస్థానం కన్నా కలెక్టర్ గొప్పవారా? సదరు సిద్దిపేట కలెక్టర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎంవోను నేను డిమాండ్ చేస్తున్నా’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.