తలనొప్పి అని సింపుల్ గా అంటాం కానీ... వాటిలో పాతిక రకాలు ఉన్నాయిట. సైనస్ వల్ల వచ్చేది, అలెర్జీల వల్ల వచ్చేది, నిద్రలేమి, ఒత్తిడి, మైగ్రేన్... రకరకాల తలనొప్పులు ఉన్నాయి. మైగ్రేన్ బాధను భరించడం కష్టమే. ఇలా మైగ్రేన్, తరచూ వచ్చే తలనొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే చేపలను తరచూ తినాలని సిఫారసు చేస్తోంది కొత్త అధ్యయనం. 


చేపల కొవ్వులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ ఆమ్లాలు మైగ్రేన్ ఉన్న వారిలో తలనొప్పి తీవ్రతను తగ్గించేందుకు సహకరిస్తాయి. ఇవి కణస్థాయిలో వాపు ప్రక్రియ (ఇన్ ఫ్లమ్మేషన్) తగ్గేలా చేస్తాయి. కాబట్టి తలనొప్పి తగ్గుతుంది. ముఖ్యంగా సాల్మన్, టూనా, సార్డైన్స్ వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కనుక ఆ చేపలను వారంతో కనీసం మూడు సార్లయినా తింటే మంచిదని చెబుతున్నారు అధ్యయనకర్తలు. 


అమెరికా పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం దాదాపు 16 వారాల పాటూ సాగింది. వారిలో నెలకు అయిదు నుంచి 20 సార్లు మైగ్రేన్ కు గురయ్యే వారిని ఎంపిక చేసుకున్నారు. వారికి నెలలో ఎక్కువసార్లు చేపలను తినిపించారు. పదహారు వారాల పాటూ అలా చేపలను తినిపించాక వారిలో మార్పును పరిశీలించారు. అందరిలోనూ దాదాపు 67 శాతం మైగ్రేన్ నొప్పి తగ్గుముఖం పట్టింది. దీంతో చేపలు తినమని సిఫారసు చేస్తున్నారు పరిశోధకులు. 


మరి వెజిటేరియన్లకు?
చేపలు తినలేని శాఖాహారులు కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోమని చెబుతున్నారు అధ్యయనకర్తలు. అవిసె గింజలు, వాల్ నట్స్ లలో ఇవి పుష్కలంగా ఉంటాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: కోవిడ్ తరువాత పెరుగుతున్న కోపం... ఇలా తగ్గించుకోండి


Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?



Also read:  డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి