YSR Sharmila :   వైఎస్ఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఎలాంటి ద్రోహం చేయలేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులు అర్పించిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తో కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్ అక్రమాస్తుల కేసులోని ఎఫ్ఐఆర్‌లో వైఎస్ఆర్ పేరు కూడా ఉందని.. చనిపోయిన వైఎస్ పేరు ఎఫ్ఐఆర్‌లో  చేర్చడానికి కారణం సోనియా గాంధీ అని ని మా వాళ్లు కూడా నన్ను ప్రశ్నించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ విగ్రహం సాక్షిగా ఒక  విషయం చెప్పాల్సి ఉందని.. తాను ఈ విషయం చెప్పకపోతే  వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదన్నారు. 


రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా సీబీఐ చార్జిషీట్‌లో పేరు !                   


వైఎస్ఆర్ బతికి లేకపోయినా అక్రమాస్తుల కేసుల్లోని ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు ఎందుకు ఉందని.. తాను సోనియా గాంధీ వద్ద ప్రస్తావించానని  షర్మిల చెప్పారు.  రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా CBI ఛార్జ్ షీట్ లో పేరు చేర్చారు అని సోనియా గాంధీ తమకు చెప్పారని..  ఆ బాధ ఎంటో మాకు తెలుసు అని అన్నారని షర్మిల స్పష్టం చేశారు.  మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తాం అన్నారన్నారు.  వైఎస్సార్ పై మాకు అపార మైన గౌరవం ఉంది .. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని అన్నారని షర్మిల గుర్తు చేసుకున్నారు.  వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుందని సోనియా బాంధపడ్డారని షర్మిల తెలిపారు.  


ఎఫ్ఐఆర్‌లో వైఎస్ పేరు తెలియక  చేసిన పొరపాటే !                


సోనియాతో మాట్లాడిన తర్వాత తనకు అర్థమైంది ఏమిటంేట...  వాళ్ళు తెలియక చేసిన పొరపాటేనని..  కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల క్లీన్ చిట్ ఇచ్చారు. వైఎస్సార్ ను సోనియా , రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారని స్పష్టం  చేశారు. ఈ అంశంపై తాను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియా తో ,రాహుల్ తో చర్చలు జరిపానని తెలిపారు. వాళ్లు   రియలైజేషన్ కి వచ్చారు ..  అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తనదని షర్మిల తెలిపారు. 


కాంగ్రెస్‌తో కలిసి పని చేసే అంశంపై చర్చలు                        
 
కాంగ్రెస్ తో ఎలా కలిసి పనిచేయాలనే విషయం పై సోనియాతో చర్చించామమని షర్మిల తెలిపారు.  సోనియాతో చర్చలు బయటపెట్టడం సరికాదన్నారు.  కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడమే మా లక్ష్యమని తెలిపారు. తాను నిలబడతా.. కార్యకర్తలను నిలబెడతానని ప్రకటించారు.  పార్టీ కార్యకర్తలు బాగుండాలనేదే తన ప్రయత్నమన్నారు.  సోనియాతో జరిగిన చర్చలు బయటకు చెప్పని షర్మిల.. పాలేరు లో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తానన్నారు.