కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ పై సీఎం కేసీఆర్ నిప్పులు చేరిగారు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు లిస్టులో తన పేరు లేకున్నా గాని ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... "ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీరు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి లిస్టులో, రెండో లిస్టులోనూ ఆయనకు చోటే దక్కలేదు. అసలు ఆయనకు అవకాశం ఇస్తారో లేదో కూడా తెలియదు. కానీ, నిన్నా మొన్నటి వరకు ‘కామారెడ్డిలో కేసీఆర్‌ను చిత్తుగా ఓడిస్తా. తప్పకుండా కామారెడ్డి నుంచే పోటీ చేస్తా. సీఎంకు డిపాజిట్ రాకుండా చేస్తా. కామారెడ్డి ప్రజలంతా నా వైపే ఉన్నారు.
కామారెడ్డి నుంచి ఈ సారి నేనే ఎమ్మెల్యే" అని షబ్బీర్ అలీ ప్రగల్భాలు పలుకుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన తీరుపై సహచరులే జాలి పడుతున్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా లేకనే కాంగ్రెస్ సైతం లేదని ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతుందని చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే షబ్బీర్‌అలీ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గాన్ని వదిలి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి వెళ్తున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోందని ఎక్కడికి వెళ్లినా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సీఎం అన్నారు. అయితే విషయాన్ని షబ్బీర్ అలీ రెండు రోజుల క్రితమే ఖండించినప్పటికీ, రెండో జాబితాలోనూ ఆయన పేరు రాకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని సీఎం చెప్పారు.
కామారెడ్డిలోని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలంతా పక్కచూపులు చూస్తున్నారని సీఎం ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా ఎవరో తెలియని అయోమయంలో బీఆర్‌ఎస్ గూటికి చేరడమే సరైందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కాంగ్రెస్ అధిష్టానం సైతం ఎంతకూ నిర్ణయం తీసుకోకపోవడంతో నిట్టూరుస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్‌లో తన మాటే ఫైనల్ అంటూ ఇన్ని రోజులు గొప్పలు చెప్పుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాటలు ఉత్తవేనన్నది తేలిపోయింది సీఎం అన్నారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ బరిలో నిలవడంతో పీసీసీ ముఖ్యనేతలంతా జంకుతున్నారు. మొన్నటివరకు తాడోపేడో అంటూ తొడలు కొట్టిన వారికే కనీసం చోటు దక్కకపోవడంతో నవ్వులపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా పోటీకి ముందే చేతులెత్తేసే పరిస్థితిని తెచ్చుకున్నది. పోలింగ్‌కు నెల రోజులే ఉన్నప్పటికీ హస్తం పార్టీ ఇంకా అభ్యర్థుల వేటలోనే మునిగి తేలుతున్నది. కామారెడ్డిలో సీఎంకు గట్టి పోటీ ఇచ్చే నేతలు ఎవరూ? అని ప్రధాన పార్టీలు ఆలోచిస్తున్నాయి. దీంతో కెసిఆర్ పై బరిలో ఎవరిని దించాలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ సందిగ్ధంలో పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ పై అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులే సమయం మిగిలి ఉండడంతో అటు కామారెడ్డి జిల్లా ప్రజలు సైతం అయోమయ పరిస్థితిలో పడ్డారు.