30 th July School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
న్యాయవాది, రచయిత రావిశాస్త్రి జననం
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజముద్ర, క్యూ ఆర్ కోడ్ ఉన్న పాస్ పుస్తకాలు మాత్రమే రైతులకు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆస్తుల రక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రైతులకు ఇచ్చే పాసు పుస్తకం నమూనాను చంద్రబాబు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సేవలను మరో ఏడాది పాటు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయనుంది. విభజన చట్టం ప్రకారం పదేళ్లు పూర్తయినందున ఈ రెండు యూనివర్సిటీలు ఏపీలో సేవలు నిలిపేశాయి.
తెలంగాణ వార్తలు:
తెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ విడతలో రూ. లక్షన్నర రుణాలను రైతుల రుణ ఖాతాల్లో జమచేస్తారు. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
తెలంగాణలో శాసనసభ అర్ధరాత్రి దాటినా కొనసాగింది. బడ్జెట్‌పై అర్ధరాత్రి దాటాక ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. అర్హులైన వారందరికీ గృహ జ్యోతి అమలు చేస్తామని ప్రకటించారు. బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు ఇస్తామని వెల్లడించారు..
జాతీయ వార్తలు
విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర విద్య శాఖ సమాయత్తమైంది. బ్యాగ్ లెస్ డేస్‌ను అమలు చేసేందుకు సిద్ధమైంది. తొలుత 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 10 రోజుల చొప్పున ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లయిన సందర్భంగా ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
బిహార్‌లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచడాన్ని కొట్టేస్తూ.. పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల కోటా పరిమితిని 50 నుంచి 65 శాతానికి పెంచుతూ బిహార్ సీఏం నీతీశ్ ప్రభుత్వం చట్టం తేగా దీన్ని హైకోర్టు రద్దు చేసింది.
అంతర్జాతీయ వార్తలు
వెనెజువెలాలో అధ్యక్షుడిగా మరోసారి నికోలస్ మడురో ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయనకు 51.20 శాతం ఓట్లురాగా.. ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కి 44.02 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపించింది.
క్రీడా వార్తలు
ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. విశ్వ క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ జోడీగా రికార్డు నెలకొల్పారు. రెండో రౌండ్ మ్యాచ్ రద్దు కావడంతో ఈ జోడీ నేరుగా క్వార్టర్స్ చేరింది.
ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే పతకం సాధించి చరిత్ర సృష్టించిన మనూబాకర్ మరో పతకం ముందు నిలిచింది. మనూ సరబ్‌జ్యోత్‌తో కలిసి 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతక రౌండ్లో ప్రవేశించింది. కొరియా జంటతో వీరు పోటీ పడనున్నారు.
మంచిమాట
అర్థరహితమైన మాటల కన్నా... అర్థవంతమైన మౌనం చాలా గొప్పది.