Revathi Husband Bhaskar Sensational Comments On Allu Arjun Case: అల్లు అర్జున్ (Allu Arjun) కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) ఘటనలో మృతురాలు రేవతి భర్త భాస్కర్ దీనిపై స్పందించారు. అవసరమైతే తాను పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదని.. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్‌తో పాటు ఆ రోజు చాలామంది థియేటర్‌కు వచ్చారని అన్నారు. 'నా కుమారుడు పుష్ప 2 సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లాను. ఇందులో అల్లు అర్జున్ తప్పేం లేదు. ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రిలో ఉన్న నేను ఫోన్‌లో అరెస్ట్ వార్త చూశాను. కేసు విత్ డ్రాకు సిద్ధంగా ఉన్నా.' అని స్పష్టం చేశారు. కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


14 రోజుల రిమాండ్


వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తరలించగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే నాంపల్లి కోర్టు తీర్పు అమలు చేస్తారా.? లేదా.? అనేది తేలనుంది. కాగా, తనపై నమోదైన అన్ని కేసులను కొట్టివేయాలని అల్లు అర్జున్ ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని, అందుకే ఆయన్ను కేసులో చేర్చి అరెస్ట్ చేశామని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు.


నేతల స్పందన


అల్లు అర్జున్ కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసు దర్యాప్తులో తన జోక్యం ఏమీ ఉండదని.. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తు చేశారు. అటు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు.. బన్నీ అరెస్టును ఖండించారు. 'జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట !. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు?. అల్లుఅర్జున్‌ని ఓ సాధారణ నేరస్థుడిగా గారూ ప్రత్యేకించి అతను నేరుగా బాధ్యత వహించని విషయానికి పిలవబడడు. ప్రభుత్వ అత్యున్నత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను.' అని పేర్కొన్నారు.



Also Read: Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !