Rythu Bandhu Funds: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ పంటల సాగు వేళ రైతు బంధు నగదును పంపిణీ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికూ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.


రాష్ట్ర రైతులకు ఎకరానికి 5వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. తెలంగాణ రైతులకు పంట సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకానికి  రూ. 7500 కోట్ల నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులు సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో బిజీగా ఉన్నా, రైతు బంధు నిధుల విడుదలపై అధికారులకు క్లారిటీ ఇచ్చారు.  


నేడు వీరి ఖాతాల్లోకి నగదు..
రైతు బంధు నిధులు విడుదల అవుతున్నప్పటికీ నేడు అందరూ రైతుల ఖాతాల్లోకి నగదు జమ కాదు. గత వానాకాలంలో ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలో నేడు రైతు బంధు కింద ఎకరాకు రూ.5 వేలు జమ అవుతాయి. డిసెంబర్ 16న రెండు ఎకరాలు ఉన్న వారికి, ఎల్లుండి మూడు ఎకరాలు, ఆ తరువాత 5, 10, 15, 20 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్న తెలంగాణ రైతులకు ఒక్కోరోజు రైతు బంధు నిధులను ఆర్థికశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. గతంలోనూ ఇదే విధంగా రైతు బంధు నగదు విడుదల చేశారు.


వానాకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు లభించింది. అంటే దాదాపు రూ.7,360.41 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ చేసింది. తాజాగా మరికొంత మంది అర్హులైన రైతులకు రైతు బంధు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటుండగా.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూడక తప్పడం లేదు. 
Also Read: KCR in Assembly: కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు  
Also Read: Revant Reddy : సొంత పార్టీకే భవిష్యత్ లేదు..ఇక జాతీయ రాజకీయాలా ? .. కేసీఆర్ తమిళనాడు టూర్‌పై రేవంత్ రెడ్డి విసుర్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి