RTC Bus Stucked In Flood In Warangal: తెలంగాణలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లా (Warangal District) నెక్కొండ మండలం వెంకటాపురం శివారులోని వరద నీటిలో ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి చిక్కుకుంది. వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా.. వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగి బస్సు నీటిలోనే చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.దీంతో రాత్రంతా బస్సులోనే ఉండిపోయారు.


తమను కాపాడాలని బంధువులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కలెక్టర్ గ్రామానికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించారు. అనంతరం వారిని స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత ప్రయాణికులను వారి స్వగ్రామాలకు తరలిస్తామని చెప్పారు. 


కారులో మృతదేహం


మరోవైపు, సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) పట్టణంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోగా.. కారులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చారు. వరద ధాటికి డివైడర్ల పైనుంచి నీరు ప్రవహిస్తుండగా.. వాటిని పగలగొట్టి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. అటు, అనంతగిరి, మేళ్లచెరువు రహదారులపై పూర్తిగా రాకపోకలు నిలిపేశారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి దూకడంతో నయనగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 


వర్షపాతం వివరాలు


శనివారం రాత్రి 8:30 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ఈ వివరాలను వెల్లడించింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 299.8 మి.మీ, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 298 మి.మీ, సూర్యాపేట జిల్లా చిలుకూరులో 297.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. అటు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నగూడురు 42.85, నెల్లికుదురు 41.65, పెద్దనాగారం 40.28, కొమ్మలవంచ 38.93, దంతాలపల్లి 33.25, మాల్యాల 33, మరిపెడ 32.4, లక్కవరం 31.98, కేసముద్రం 29.8, ఆమన్ గల్ 28, మహబూబాబాద్ 27.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. రెడ్లవాడలో 43.55, కల్లెడ 27.88 సెం.మీల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. 


అటు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో వరద నీరు చేరి స్కూల్ బస్సులు నీట మునిగాయి. పాలేరు జలాశయంలోకి 40 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వనపర్తి జిల్లాలోని సరళ సాగర్‌కు వరద పోటెత్తగా పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అటు, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ప్రమాదకరపు అంచుల్లో అలుగు పోస్తుంది. దీంతో పాలేరు గ్రామంలో ఇళ్లు నీట మునగడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.


Also Read: Revanth Reddy: వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష, 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు