Rouse Avenue Court Adjourned Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కాంకు (Delhi liquor scam) సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు (Mlc Kavitha) మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) విచారణ చేపట్టింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరగ్గా.. తీర్పును మే 2 (గురువారం)కు రిజర్వ్ చేసింది. ఇవాళ విచారణ సందర్భంగా మే 6వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. 






ఇరువర్గాల వాదన ఇదే


ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. 'మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలు. ఆమె అరెస్ట్‌ నుంచి విచారణ వరకు ఎటువంటి సాక్ష్యం లేదు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్‌ చేశారు' అంటూ కవిత తరఫు న్యాయవాది సింఘ్వి వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్‌ చేశారని.. అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తమ రాజకీయ పార్టీకి కవిత స్టార్‌ క్యాంపెయినర్‌ అని.. ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారని వాదించారు. ఆమె పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని గుర్తు చేశారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఉన్న కేసులో అరెస్ట్‌ అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. 


సీబీఐ ఏం చెప్పిందంటే.? 


ఈ క్రమంలో సీబీఐ తన వాదనలు వినిపించింది. లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని వాదించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కవిత కింగ్‌ పిన్‌ అని.. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని అన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా, మే 6కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.


Also Read: Manne Krishank Arrest: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ అరెస్ట్, ఎట్టకేలకు వెల్లడించిన పోలీసులు