BRS social media incharge Manne krishank: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్ ఎపిసోడ్ పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు. మరికాసేపట్లో కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొన్న తర్వాత క్రిశాంక్ హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొన్ని గంటలు గడిచినా క్రిశాంక్ ఆచూకీ తెలపకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బీఆర్ఎస్ నేతలు సైతం క్రిశాంక్ అరెస్టుపై పోలీసులను సమచారం కోరగా తమకు తెలియదనడంతో ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో మన్నే క్రిశాంక్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.


సర్క్యూలర్ ఎడిట్ చేశారని ఫిర్యాదు 
సూర్యాపేట టోల్  గేట్ వద్ద బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సర్కులర్ ను ఎడిట్ చేసి.. వాట్సప్, ఫేస్బుక్ ట్విట్టర్లలో ప్రచారం చేస్తున్నారని ఓయూ అధికారుల ఫిర్యాదు అందింది. ఓయూ ప్రతిష్ఠ కు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. దాంతో Ipc 466,468 ,469 ,505 (1)(C) కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






 


ఈ క్రమంలో బుధవారం (మే 1న) మన్నే క్రిశాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీసులు జడ్జి ముందు ప్రవేశ పెట్టనున్నారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ నుండి జడ్జి వద్దకు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.


క్రిషాంక్ అరెస్టు అక్రమం 
క్రిషాంక్ అరెస్టు.. అక్రమం.. అన్యాయం.. దుర్మార్గం.. క్రిషాంక్  అంటే..  ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక , యువతరానికి ప్రతిబింబం అన్నారు కేటీఆర్. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై.. ఢిల్లీ బీజేపీ అరాచకాలపై.. గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం.. ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గం అని పేర్కొన్నారు. కాంగ్రెస్- బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు ఎన్నికల్లో మూల్యం చెల్లించక తప్పదు.. ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు అన్నారు. నాడు ఎమర్జెన్సీ చూశాం .. నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నాం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే.. రేపు కాంగ్రెస్-బీజేపీలకు పట్టడం ఖాయం.. తథ్యమన్నారు కేటీఆర్.