Revenue Officers Demolished Mla Marri Rajasekhar Reddy College Buildings: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Mallareddy) ఇటీవల షాకుల మీద షాకులు తగులుతున్నాయి. భూమిని ఆక్రమించి రోడ్డు వేశారని ఆయనకి చెందిన కాలేజీ రోడ్డును తొలగించగా.. గురువారం ఆయన అల్లుడి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. హైదరాబాద్ (Hyderabad) శివారు దుండిగల్ లోని చిన్న దామరచెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో ఆయనకు చెందిన ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను కూల్చేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. దీనిపై వారం క్రితమే ఆయా యాజమాన్యాలకు నోటీసులిచ్చారు. తాజాగా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. అయితే, దీన్ని అడ్డుకునేందుకు కొంత మంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి పోలీసులు సద్దిచెబుతున్నారు.
ఇటీవలే మల్లారెడ్డికి షాక్
కాగా, మల్లారెడ్డికి (Malla Reddy) ఇటీవలే అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ (HMDA) లే అవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణలపై కలెక్టర్ దృష్టి సారించారు. అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించగా.. ఆ రోడ్డును అధికారులు తొలగించారు. అయితే, అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలనే కొంత మంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. హెచ్ఎండీఏ (HMDA) అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు వేశామని స్పష్టం చేశారు. 2,500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని చెప్పారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడతారని అన్నారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు.
కబ్జాలపై కలెక్టర్ ఆగ్రహం
మరోవైపు, చెరువు కబ్జాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేట, నెక్నామ్ పూర్ లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్ లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తోన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు బిల్డర్స్ ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎకరం విస్తీర్ణంలో చెరువు స్థలంలో విల్లాల నిర్మాణాలను రెవెన్యూ శాఖ గుర్తించింది.