MLC Kavitha Comments on Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో తాను బాధితురాలినేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. గురువారం ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. టీవీ సీరియల్ మాదిరిగా కేసు కొనసాగిస్తున్నారని.. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడితే ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు. 'లిక్కర్ కేసు...పెద్ద కేసు కాదు. నాకు కూడా పెద్ద ఇంటరెస్ట్ లేదు. మా లీగల్ టీం దాన్ని చూసుకుంటుంది. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయింది. ఆదర్శ్ స్కామ్ లో ప్రమేయం ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన్ను సీఎంగా చేస్తారేమో!' అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆమె మండిపడ్డారు. సాగునీరు, తాగునీరు ఇవ్వలేమని సీఎం అంటున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ కరువు. కేసీఆర్ ను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. రేవంత్ పాలనలో బీసీ మేజర్ కులాలకు ప్రాధాన్యత లేదు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉంది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది.' అని వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్లపై..
గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'యూట్యూబ్ చానెల్ మీద తీవ్ర కేసులు పెడుతున్నారు. పిల్లల శవాలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయి. 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎన్నడూ తెలంగాణ సమస్యల మీద పార్లమెంట్ లో మాట్లాడలేదు. గులాబీ సైనికులైన బీఆర్ఎస్ ఎంపీలే ఎప్పుడూ తెలంగాణ కోసం కేంద్రాన్ని ప్రశ్నించారు. సోనియా గాంధీకి ఇటీవల రాసిన లేఖపై రిప్లై వస్తుందని అనుకోవట్లేదు. అయినా బలి దేవత రిప్లై ఇస్తారా.?.' అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ పై ముద్ర పడబోతోందని కవిత మండిపడ్డారు. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తూ జీఓ 3 ఇచ్చారని.. ఫిబ్రవరి 6న కోర్టు ఉత్తర్వులను ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించారు. మహిళలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. శుక్రవారం జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని స్పష్టం చేశారు.
అదే పర్మినెంట్ ఎజెండా
తాను ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ నిర్ణయంపై కట్టుబడి ఉంటానని కవిత స్పష్టం చేశారు. అర్వింద్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మొన్న కోరుట్లలో ఓడించానని.. ఎంపీ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని.. ఎప్పుడూ అదే పర్మినెంట్ ఎజెండా అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోతే ప్రజలకే నష్టమని చెప్పారు.