Revant Letter To KCR :  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. పత్తికి గిట్టుబాటు ధర, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కౌలు రైతులకు కూడా అన్ని రకాల పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి క్వింటాల్ కు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని, వెంటనే రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రూ.లక్ష రుణమాఫీ చేయాలన్న ఆయన... ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ప్రైవేటు అప్పులను వన్ టైం సెటిల్ మెంట్ కింద పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించి, రైతులకు వర్తించే అన్ని పథకాలను వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. అలాగే పంటల బీమా పథకాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. 


రైతులు సవాలక్ష సమస్యల్లో ఉన్నారు : రేవంత్ 


రాష్ట్రంలో రైతులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరైన వ్యవసాయ విధానం లేకపోవడం.. పంటల ప్రణాళిక లేకపోవడం, రైతులకు దిశానిర్దేశం చేసే వారు లేకపోవడం, రుణ ప్రణాళికలు సరిగా అమలు చేయకపోవడం, ప్రకృతి విపత్తుల సమయంలో భరోసా ఇవ్వకపోవడం, పంట నష్టం జరిగినప్పుడు పరిహారానికి భరోసా లేకపోవడం వంటి అనేక కారణాలు రైతులను సంక్షోభంతో నెట్టేశాయని మండిపడ్డారు.  పంట ఏదైనా దళారులు చెప్పిందే రేటు అన్నట్లుగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు.మద్దతు ధర అంటూ రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆరోపించారు. 


రైతుల్ని పట్టించుకోకపోతే ఎలా :  రేవంత్ 


  విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోతే ఎలా అని రేవంత్ నిలదీశారు. పత్తికి క్వింటాలుకు రూ.15 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. దళారులు రైతులను మోసం చేస్తుంటే అండగా ఉండాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని రేవంత్ వాపోయారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.  గత 2014 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడితే.. ఈ ఏడాదిలో నవంబరు నాటికి 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని చెప్పారు. మొత్తంగా చూస్తే గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 7,069 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని వారిలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారని గుర్తు చేశారు. 


గత ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చిన కేసీఆర్ 


బీఆర్ఎస్ గత ఎన్నికల్లో రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ రూ. యాభై వేల లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసింది. రూ. లక్ష మేరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెబుతోంది. కొత్త ఏడాదిలోనే రుణమాఫీ ఉంటుందని చెబుతున్నారు.