Hyderabad : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంతో పోటీపడేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ మహా నగరంలో మౌలిక వసతుల కల్పనలకు రూ.ఏడు వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేట్టినట్లు ఆయన తెలిపారు. ఎస్టీపీలు, ఫ్లై ఓవర్లు, డ్రైన్ల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన హైదరాబాదులో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో పాల్గొన్నారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో రూ.5827 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందరీకరణ పనులు, రూ.3,500 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.16.50 కోట్లతో నిర్మించిన భూగర్భ సంపులను ఆయన ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధి, 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను ఆయన అందించారు. అంతే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్‌తో కూడిన కొత్త ఆన్‌లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానం ఫిబ్రవరి 2025 నుంచి అమల్లోకి రానుంది.
గుడిసెలో జీవించాలి
ఈ కార్యక్రమంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలను గుప్పిస్తున్న ప్రతిపక్షం పై మండిపడ్డారు. మూసి పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోవడం కాదు. అక్కడే గుడిసె వేసుకుని చిరస్థాయిగా జీవించి చూపించాలని అన్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి మూసి పరివాహక ప్రాంతంలో ఒక రోజు నిద్రపోయి తర్వాత నుంచి ప్యాలెస్ లో ఉండడం సరికాదన్నారు.
మూసీకి పునరుజ్జీవం
రాజధాని గుండా ప్రవహిస్తున్న మూసీ నదికి పునరుజ్జీవం తీసుకువచ్చి మురికి కూపంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. దాంతో పాటు హైదరాబాదు నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చి పర్యాటకంగా, అందంగా అభివృద్ధి చేసి, మూసిని జీవ నదిగా మార్చాలని తమ ప్రభుత ముందుకుపోతందన్నారు. ఇది ప్రతిపక్షాలకు ఇష్టం లేదని అందుకే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల పైగా ప్రవహిస్తున్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి పునరుజ్జీవం తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నది. గోదావరి నీళ్లను తీసుకువచ్చి మూసీలో కలిపి పునరుజ్జీవం తీసుకువస్తామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి విద్య ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించలేమన్న భయంతో కుట్రపూరితంగా బిఆర్ఎస్ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొడుతుందన్నారు.
కుట్రలు మానుకోవాలి
హైదరాబాద్ నగరం మీద ప్రేమ, పేదవాళ్లపై అభిమానం ఉంటే సహకరించాల్సింది పోయి కుట్రలు చేయడం మానుకోవాలని బిఆర్ఎస్ నాయకులకు సూచించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం పది వేల కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులకు సజావుగా ప్రయాణించేందుకు అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మాణం చేసి రోడ్లు అభివృద్ధి చేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 400 మురికివాడల్లో నివాసం ఉంటున్న మహిళలను వ్యాపార వేత్తలుగా మార్చడానికి మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు అందించాలని ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. ఢిల్లీ లాంటి ముప్పు హైదరాబాదు నగరానికి రావొద్దన్న ముందు చూపుతో కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
పదేళ్లలో పది పైసలు ఖర్చు చేయని బీఆర్ఎస్
హైదరాబాదు నగరం రాష్ట్రానికే తలమానికం కాదని దేశం గర్వించే విధంగా అభివృద్ధి చేయబోతున్న నగరంగా మారబోతున్నదని అన్నారు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా మార్చాలన్న సంకల్పంతో పస రేవంత్ రెడ్డితో సహా మంత్రిమండలి సభ్యులందరం చర్చించి హైదరాబాదుకు కావలసిన అన్ని హాంగులను తీసుకురావడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని వెల్లడించారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన టిఆర్ఎస్ పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి రంగులు వేసుకుని పదేళ్లు కాలం వెళ్లదీశారని ఆరోపించారు. పదేళ్లు పాలించి పది పైసలు కూడా నగరం కోసం ఖర్చు చేయని బిఆర్ఎస్ పాలకులకు విమర్శలు చేసే అర్హత లేదన్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నగరవాసులకు ఇప్పుడు అందుతున్న గోదావరి, కృష్ణ, మంజీరా నీటి పథకాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన ఫలితమేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read: Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్ విధానం