Maharashtra CM Eknath Shinde ముంబై: మహరాష్ట్రలో కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో చేరే అవకాశం ఉన్న 17 మంది మంత్రుల జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే శివసేన నుంచి 7 మందికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేసే ఛాన్స్ ఉండగా, మహాయుతి క్యాబినెట్ జాబితాలో రాహుల్ నార్వేకర్, నితేశ్ రాణే ఆశిష్ షెలార్, గిరీష్ మహాజన్ పేర్లు ఉన్నాయి.
కాగా, శివసేనకు చెందిన ఏడుగురు నేతలకు మహారాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు గులాబ్రావ్ పాటిల్, అర్జున్ ఖోట్కర్, దాదా భూసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్ మహాయుతి కొత్త కేబినెట్‌లోకి రానున్నారు.
ఏకనాథ్ షిండేకు అనారోగ్యం
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ప్రచారం జరిగింది. జర్వం, గొంతునొప్పి, వంటి నొప్పులతో బాధపడుతున్న ఆయనను తాజాగా థానేలోని జుపిటర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని, డాక్టర్లు ఆయను పలు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తీరికలేని షెడ్యూల్ తోనే..
సీఎం ఏకనాథ్ షిండ్ ఆరోగ్య పరిస్థితిపై శివసేన (షిండే) నేత సంజయ్ షిర్సత్ వ్యాఖ్యానించారు. గతనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీరిక లేని పని ఒత్తిడి వల్లే సీఎం ఆరోగ్యం ఖరాబైందని తెలిపారు. ఎన్నికల సభల్లో విశ్రాంతి లేకుండా పాల్గొనడం వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక, తాజాగా ఆయన తన స్వగ్రామం సతారా జిల్లాలోని దారే గ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ షిండే పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్లు వివిధ రకాలైన టెస్టులు చేస్తున్నారని, ఆ తర్వాత చికిత్సతో షిండే ఆరోగ్యం మెరుగవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
రోటిన్ చెకప్ మాత్రమే..
మరోవైపు శివసేన (షిండే) మరో నేత ఉదయ్ సామంత్ మాత్రం ఏకనాథ్ షిండే ఆస్పత్రిలో చేరడంపై ఆందోళన అవసరం లేదని తమ పార్టీ శ్రేణులకు సూచించారు. రొటిన్ హెల్త్ చెకప్ లో భాగంగానే జుపిటర్ ఆస్పత్రికి షిండేను తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే ముంబైలోని ఆయన అధికారిక నివాసానికి షిండే చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు షిండే అకస్మాత్తుగా తన స్వగ్రామానిక చేరుకోవడంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. మహాయుతి కూటమి ఎన్నికల్లో బంపర్ మెజారీటి సాధించడంతో తిరిగి తననే సీఎంగా కొనసాగిస్తారని భావించిన షిండేకు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ సీఎంగా ఎన్నికయ్యే అవకాశముందని తెలిసి, ఆయన అలకతో స్వగ్రామానికి వెళ్లినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతకుముందు తన సీఎం పదవీ కాపాడుకోసం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన షిండే.. కనీసం తన కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండేకు ఉపముఖ్యమంత్రి పదవిని అయినా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ డిమాండ్లను బీజేపీ అధిష్టానం తిరస్కరించడంతో ప్రభుత్వంలో కీలక శాఖలు కేటాయించాలని షిండే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం పీడబ్ల్యూడీ శాఖను కేటాయిస్తామని తెలపడంతో షిండే అలక వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Tripura Bangladesh News: హోటల్స్‌లోకి బంగ్లాదేశీయులకు ఎంట్రీ లేదు- హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
షరవేగంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 5న దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదని తెలుస్తోంది. ఈనెల 4న బీజేఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలుస్తోంది.
ఇక గతనెలలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లతో జట్టు కట్టిన బీజేపీ 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 230 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీకి 132 సీట్లు, శివసేన 57, ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి.