Revanth Reddy : ఒలింపిక్స్ టార్గెట్‌గా పని చేద్దాం రండి - ఆనంద్ మహింద్రాకు రేవంత్ రెడ్డి పిలుపు
Telangana Sports University : పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రాకు రేవంత్ మరో పిలుపు ఇచ్చారు. ఒలింపిక్ క్రీడాకారుల్ని సిద్ధం చేసేందుకు కలసి రావాలని కోరారు.

Revanth Reddy called Anand Mahindra to come together For Sports : భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రాకు మరో కీలక బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ చైర్మన్ గా ఆనంద్ మహింద్రా నియమితులయ్యారు. ఆయనను కొత్తగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీకి కూడా చైర్మన్ గా ఉండేలా అంగీకరింపచేసేందుకు ప్రయ.త్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా తాజాగా ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై ఓ పోస్టు పెట్టారు. ఆటల్లో ప్రతిభాన్వేషణ జరగాల్సి ఉందని అందు కోసం దేశవ్యాప్తంగా మరింత కృషి జరగాల్సి ఉందన్నారు.
ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా పోస్టు వైరల్ అయింది. వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై ప్రైవేటుగా దీనిపై చర్చించాలనుకున్నానని కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్‌లో రిప్లయ్ ఇస్తున్నానన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఆలోచన గురించి రేవంత్ పోస్టులో వివరించారు. కొరియా పర్యటన సమయంలో అక్కడ స్పోర్ట్స్ యూనివర్శిటీని సంప్రదించానని.. ఆ స్థాయిలో ఇక్కడ కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని తెలిపారు. హకీంపేట వద్ద రెండు వందల ఎకరాలు గత మూడు రోజుల్లోనే సిద్ధంగా ఉంచామన్నారు. లాస్ ఎంజెల్స్ ఒలింపిక్స్ కు భారత్ తరపున మంచి ఆటగాళ్లను సిద్ధం చేయడానికి.. ఒలిపింక్ స్థాయి మౌలిక సదుపాయాలను ఆటగాళ్లకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ విషయంలో కలసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్పొరేట్ కంపెనీని నడుపుతున్న ఆనంద్ మహింద్రా క్షణం తీరిక లేకుండా ఉంటారు. అయినప్పటికీ తెలంగాణ యువతలో స్కిల్స్ పెంచేందుకు తన వంతు సహకారం , సమయం ఇచ్చేందుకు స్కిల్ యూనివర్శిటీ చైర్మన్ గా ఉండేందుకు సిద్ధమయ్యారు. అయితే రేవంత్ రెడ్డి మరో బాధ్యతకు స్పోర్ట్ యూనివర్శిటీ బాధ్యత కూడా ఆఫర్ చేస్తున్నారు. స్వయంగా ఆటలపై మంచి అవగాహన ఉన్న ఆనంద్ మహింద్రా అంగీకరిస్తే.. ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్శిటీ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లే అనుకోవచ్చు.