CM Revanth Reddy: దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే సంఘీభావ ర్యాలీ నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత దేశ సార్వభౌమత్వాన్నిదెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లే.. ఇది మా హెచ్చరిక అని తెలిపారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటవుతాం ..మేం శాంతి కాముకులం.. అది మా చేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదిటి సిందూరం తుడిచేయాలనుకుంటే… వారికి ఆపరేషన్ సిందూర్ తో సమాధానం చెబుతామన్నరాు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.
బ్రిటిష్ వాళ్ల నుంచి శాంతి ద్వారానే భారత్‌తో పాటు పాక్‌కు కూడా స్వేచ్ఛా వాయువులు అందించి మహాత్మా గాంధీ అమరులయ్యారని, ఆయన చేసిన శాంతియుత పోరాటం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని గుర్తు చేశారు.పరేషన్ సిందూర్ వంటి వాటి ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని అన్నారు. ఆ వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని అన్నారు. ప్రపంచ దేశాల్లోనే భారత్ ఒక గొప్ప దేశంగా నిలబడిందని, భారత్ అనుసరిస్తున్న శాంతి విధానానికి పరీక్ష పెట్టొద్దని పేర్కొన్నారు. పహల్గాంలో మహిళల సిందూరం తుడిచిన వాళ్లకు ఆపరేషన్ సిందూర్ సరైన జవాబు అని తెలిపారు. భారత్ తలుచుకుంటే ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారానే మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవాన్లకు ఉందన్నారు.
పాక్ ఉగ్రవాదులు, పాక్ పాలకులు, అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకుంటే ఈ భూమ్మీద మీకు నూకలు చెల్లినట్లేనని, ఈ భూమ్మీద మీరు నివసించేందుకు అర్హత కోల్పోయినట్లేని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులమంతా ఒక్కటేనని అన్నారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటంలో అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి నగరంలోని యువత పెద్ద ఎత్తున తరలి వచ్చింది. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. పహల్గామ్ టెర్రరిస్టుల దాడిలో అమరులైన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.