Telangana New CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరు ప్రకటించిన అనంతరం కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తెలంగాణ కేబినెట్ కూర్పు సహా ఇతర అంశాల గురించి అధిష్ఠానంతో చర్చిస్తున్నారు. అవి ముగించుకొని హైదరాబాద్‌కు పయనం అవుతున్న రేవంత్ రెడ్డికి మళ్లీ వెనక్కు రావాలని పిలుపు వచ్చింది. దీంతో అప్పటికే ఢిల్లీ ఎయిర్ పోర్టు వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి మళ్లీ వెనక్కి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో మహారాష్ట్ర సదన్‌లో భేటీ అయ్యారు. కేబినెట్ భేటీకి సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.


మంగళవారం (డిసెంబర్ 5) కాంగ్రెస్ హై కమాండ్ సీఎం అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డిని ప్రకటించిన వెంటనే అధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఏఐసీసీ అగ్రనేతలతో తన కేబినెట్ లో తీసుకోవాల్సిన ఎమ్మెల్యేలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు.