Telangana Police Jobs: ఇంద్రవెల్లి: తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోస్టుల భర్తీ బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కూడా కాలేదన్నారు. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలు అప్పుడే ఎగిరిపడుతున్నాయంటూ మండిపడ్డారు.
త్వరలోనే ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్
త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇటీవల వారికి నియామక పత్రాలు అందించారని చెప్పారు. బిల్లా రంగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఓడిపోతే ఆమెను ఎమ్మెల్సీగా జాబ్ ఇచ్చారని సెటైర్లు వేశారు. కానీ ఈ పదేళ్లలో అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉద్యోగాల కోసం శ్రమిస్తున్న నిరుద్యోగులు మీకు గుర్తురాలేదా అని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా 2021లో ఇంద్రవెల్లి సభలో కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెడ్లతాం అన్నం, డిసెంబర్ మూడో తేదీన మా మీద నమ్మకంతో ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు తెలిపారు. రాంజీ గోండ్, కుమ్రం భీం పేర్లు లేకుండా ఏ చరిత్ర ముందుకు పోదు. తుమ్మిడి హేట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతాం, ప్రాజెక్ట్ లను రిపేర్ చేసి ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, కేసీఆర్ దనదాహం వల్లే కాళేశ్వరం కులిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కూల్చడం మీ తరం కాదు.. అలాంటి ప్రయత్నాలు చేస్తే తొక్కుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.