Raising Temparatures in Telangana: తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రిపూట సైతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. శుక్రవారం అత్యధికంగా ఆదిలాబాద్ లో 43.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల 42.8, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దనొరాలో 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో వడగాల్పులు
ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటో తేదీన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రెండో తేదీన, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 3 రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటు భద్రాచలం, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రోడ్డుపైకి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.