KTR Sensational Tweet: శూన్యం నుంచి సునామీని సృష్టించి అసాధ్యం అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పోరాట పంథాలో కదం తొక్కుతామని.. నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరి.. లక్షల మందితో ఓ సైన్యాన్ని తయారు చేశారని.. ఎన్నో అవమానాలు, కుట్రలు, కుతంత్రలు ఛేదించారని అన్నారు. అలాంటి వ్యక్తిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే వారికి తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని అన్నారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్ల పోరాడి తెలంగాణ సాధించారని.. రాష్ట్ర దిశ, దశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్, బీఆర్ఎస్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని ట్వీట్ లో పేర్కొన్నారు. పోరాట పంథాలో కదం తొక్కుతామని స్పష్టం చేశారు.






'కాళ్లు పట్టుకున్నా రానివ్వం'


మరోవైపు, కష్టకాలంలో బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేకే, కడియం వంటి నాయకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు జారుకున్నారని మండిపడ్డారు. 'పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు. వారి విమర్శలపై వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఈ రోజు నాయకులు పార్టీని వదిలేసినా.. పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తాను. ఇన్ని రోజులూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల కోసం నేనే స్వయంగా వస్తా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటా. కష్టంకాలంలో పార్టీని వీడుతున్న వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి రానివ్వం.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






'6 గ్యారెంటీలు పోయి 6 గారడీలు'


కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పోయి ఆరు గారడీలు మిగిలాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డీ లీకుల వీరుడిగా మారారని.. ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతులకు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500, అందరికీ ఉచిత కరెంట్ వంటి హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రంలో ఏ వర్గం వారు సంతోషంగా ఉన్నారో సీఎం చెప్పాలి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఐదేళ్లు ప్రభుత్వంలో ఉండి 420 హామీలు నెరవేర్చాలి. నీకు నల్గొండ, ఖమ్మం నేతలే మానవబాంబులు అవుతారు. రేవంత్ రాహుల్ కోసం పని చేస్తున్నారా.? లేదా మోదీ కోసమా.?. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకే లాభం అవుతుంది.' అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Also Read: BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్