Singareni Election News: తెలంగాణ ఎన్నికలు ముగిసి పది రోజులు కాకముందే మళ్లీ సింగరేణిలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. సింగరేణిలో కాంగ్రెస్‌ అనుబంధ సంఘం అయిన ఐఎన్‌టీయూసీ (ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌) విజయం సాధించడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సింగరేణి మ్యానిఫెస్టోను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌టీయూసీ తరఫున ప్రచారానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు అవుతారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 


రాహుల్ గాంధీ సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాలో పర్యటిస్తారని, అనంతరం పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కార్మిక సమస్యల పరిష్కారంపై భరోసా కల్పిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. శాసనసభ ఎన్నికల్లో కోల్‌ బెల్ట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు దుద్దిళ్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌, జాతీయ కార్యదర్శి చంద్రశేఖర్‌, ప్రచారాల ఇన్‌ఛార్జి వికాస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో 39,748 మంది కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. వీరికోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌ ఏరియాలో ఐదు, కొత్తగూడెంలో ఆరు, ఇల్లెందులో మూడు, మణుగూరులో ఏడు, రామగుండం - 1లో 11, రామగుండం - 2లో ఆరు, రామగుండం - 3లో ఆరు, భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో ఐదు, మందమర్రిలో 11, శ్రీరాంపూర్‌లో 15 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. పోలింగ్‌ రోజే రాత్రి ఓట్ల లెక్కింపు ఉంటుంది. దీనికోసం కూడా ఎన్నికల లెక్కింపు కేంద్రాలను కూడా కార్మిక శాఖ ప్రకటించింది. 


ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే
ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 10 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇల్లెందు ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లోని ఓట్లను ఇల్లెందు ఏరియా కమ్యూనిటీహాల్, మణుగూరు ఏరియాలో పోలైన ఓట్లను పీవీకాలనీ కమ్యూనిటీహాల్, కొత్తగూడెం ఏరియాలో పోలైన ఓట్లను రుద్రంపూర్‌ ఆర్సీవోఏ క్లబ్, రామగుండం ప్రాంతంలోని ఆర్జీ–1,2, 3 ఏరియాల ఓట్లను గోదావరిఖని సెక్టర్‌–1 కమ్యూనిటీ హాల్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి టౌన్‌ షిప్, సీఈఆర్‌క్లబ్, మందమర్రి ఏరియాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను మందమర్రి సీఈఆర్‌ క్లబ్, భూపాల్‌పల్లి ఏరియా ఓట్లను కృష్ణ కాల నీ మినీ ఫంక్షన్‌హాల్, శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఓట్లను సీసీసీ ఎస్‌సీవోఏ క్లబ్, కార్పొరేట్‌లో హెడ్ ఆఫీస్‌ న్యూ కాన్ఫరెన్స్‌ హాల్, కార్పొరేట్‌ బూత్‌–5 ఓట్లను సింగరేణి భవన్‌ మూడో ఫ్లోర్‌లో లెక్క పెట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.