Priyanka Batukamma :  తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బతకుమ్మ పండుగ సందడి కనిపిస్తోంది. సాయంత్రం అయ్యే సరికి ఏ వీధి చూసిన పూలపండుగే జరుగుతోంది. ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రియాంకా గాంధీ పండుగ శుభాకాంక్షలు వినత్నంగా తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ...ప్ర‌త్యేకించి తెలంగాణ ఆడ‌ప‌డు‌చుల‌కు బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రియాంకా... త‌న నాన‌మ్మ, మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాలుపంచుకున్న పాత ఫొటోను షేర్ చేశారు. 





 1978లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఇందిరా గాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా పూల‌తో అలంక‌రించిన బ‌తుక‌మ్మ‌ను త‌న చేతుల్లో ప‌ట్టుకుని ఉన్న ఇందిరా గాంధీ ఫొటోనే ప్రియాంకా గాంధీ షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో త‌న‌ నానమ్మ ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతిగా నిలిచింద‌ని ప్రియాంకా పేర్కొన్నారు. 


తెలంగాణతో ఇందిరాా గాంధీకి ప్రత్యేకమైన అనుబంధం 


తెలంగాణతో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో... ఆమె మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1980లో  జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  ఇందిర మెద‌క్ పార్ల‌మెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ స్థానానికి ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ ..తెలంగాణపై ఇందిరకు ఉన్న ప్రత్యేకమైన అభిమానమే అలా పోటీ చేయడానికి కారణం అయిందన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఇదే విషయాన్ని ప్రియాంకా గాంధీ మరోసారి గుర్తు చేశారు. 


ఇటీవలే తెలంగాణ బాధ్యతలు తీసుకున్న ప్రియాంకా గాంధీ 


గతంలో ఎప్పుడూ ప్రియాంకా గాంధీ ఇలా ట్వీట్లు చేయలేదు. కానీ తెలంగాణ రాజకీయాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.  స్వయంగా పరిశీలన చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట పార్టీ నేతలందర్నీ పిలిచి సమీక్ష కూడా చేశారు. అప్పట్నుంచి  తెలంగాణ పార్టీ నేతలు ఆమెకే రిపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల షబ్బీర్ అలీను పార్టీ నుంచి తొలగించాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రియాంకే లేఖరాశారు. అందుకే  తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ విషయంలో పాత జ్ఞాపకాల్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారని బావిస్తున్నారు.  


తెలంగాణలో  ఘనంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాలు


తెలంగాణ వ్యాప్తంగా ఊరువాడా అంతా పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటూ పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణ ఆడపడుచులు కూడా పూల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా బతుకమ్మ పండుగలను పలుచోట్ల నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది.