NTR Coin: తెలుగు ప్రజలందరూ ప్రేమ, అభిమానాలతో అన్నగారు అని పిలిచుకునే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేలు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్మారక నాణెం కొనుగోలుకు అభిమానుల పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయగా.. మంగళవారం సైఫాబాద్‌, చర్లపల్లి మింట్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయించారు. అయితే సైఫాబాద్‌లోని మింట్‌ మ్యూజియం వద్ద ఉదయం 9 గంటల నుంచే ఎన్టీఆర్‌ అభిమానులు క్యూలో నిల్చున్నారు. తమ అభిమాన నాయకుడి నాణేన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చాలా సేపు క్యూలోనే నిల్చున్నారు. 


ఈ క్రమంలోనే మింట్‌ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) గుండపునీడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేన్ని పది వేలకు మించి ముద్రించ లేదని చెప్పుకొచ్చారు. కానీ ఎన్టీఆర్‌ నాణేనికి మాత్రం పెద్ద ఎత్తు డిమాండ్‌ ఉంటుందని ముందుగానే భావించి 12 వేలు ముద్రించామని స్పష్టం చేశారు. అనుకున్న దానికంటే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో.. మరో 8 వేలు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో కలిపి మొదటి రోజు 5 వేల వరకు నాణేలు విక్రయించామని వివరించారు. చెక్క పెట్టెలలో ఉన్న నాణేలకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, అవి స్టాక్‌ తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఏ స్మారక నాణెమైనా ఒకే థీమ్‌తో తయారవుతుందని, ఎన్టీఆర్‌ నాణెం మాత్రం ప్రత్యేకంగా మూడు వేరియంట్లలో అందజేస్తున్నామని తెలిపారు. 


అయితే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఇండియా గవర్నమెంట్‌ మింట్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌ లైన్‌లో ఎన్టీఆర్‌ స్మారక నాణేలను అమ్మకానికి పెట్టారు. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేల అమ్మకాలు జరిగిపోయాయి. దీంతో వెబ్‌సైట్‌లో అవుటాఫ్‌ స్టాక్‌ బోర్డు పెట్టారు.


Read Also: NTR Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం ధర ఎంత? ఎక్కడ దొరుకుతుంది? - ప్రత్యేకతలు ఇవే


ఈ నాణేలను ఎక్కడ తయారు చేస్తున్నారంటే?


ఈ స్మారక నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ లోనే తయారు చేస్తున్నారు. ఈ నాణెం తయారీలో నాలుగు లోహాల మిశ్రమాన్ని ఉపయోగించినట్లు హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఈ నాణెం తయారీకి 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఈ ప్రత్యేక స్మారక నాణేన్ని తయారు చేశారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని రూ. 100 నాణెంగా దీనిని రూపొందించారు. చెప్పుకోవడానికి ఈ నాణెం ధర రూ.100 లే అయినప్పటికీ.. ఈ నాణేం అసలు ధర మాత్రం రూ.3500 నుంచి రూ. 4,850 వరకు ఉంటుందని హైదరాబాద్ మింట్ అధికారులు చెబుతున్నారు. ఈ నాణేన్ని కావాలనుకునే వారు అడిగిన విధంగా ప్యాకింగ్ చేసి అందిస్తారు కాబట్టి.. ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని మింట్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ స్మారక నాణెం తయారీకి కూడా సుమారు రూ. 4 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ స్మారక నాణేలు మార్కెట్లో చలామణిలో ఉండవు. కేవలం వారి గుర్తుగా దాచుకోవడానికి మాత్రమే.