NTR Coin: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు చలన చిత్ర నట దిగ్గజం స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర సర్కారు స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. ఎన్టీ  రామారావు ముఖ చిత్రంతో ప్రత్యేక రూ.100 రూపాయల నాణేన్ని ముద్రించింది కేంద్ర ప్రభుత్వం.


ఈ స్మారక నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ లోనే తయారు చేస్తున్నారు. ఈ నాణెం తయారీలో నాలుగు లోహాల మిశ్రమాన్ని ఉపయోగించినట్లు హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఈ నాణెం తయారీకి 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఈ ప్రత్యేక స్మారక నాణేన్ని తయారు చేశారు. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని రూ. 100 నాణెంగా దీనిని రూపొందించారు. చెప్పుకోవడానికి ఈ నాణెం ధర రూ.100 లే అయినప్పటికీ.. ఈ నాణేం అసలు ధర మాత్రం రూ.3500 నుంచి రూ. 4,850 వరకు ఉంటుందని హైదరాబాద్ మింట్ అధికారులు చెబుతున్నారు. ఈ నాణేన్ని కావాలనుకునే వారు అడిగిన విధంగా ప్యాకింగ్ చేసి అందిస్తారు కాబట్టి.. ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని మింట్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ స్మారక నాణెం తయారీకి కూడా సుమారు రూ. 4 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ స్మారక నాణేలు మార్కెట్లో చలామణిలో ఉండవు. కేవలం వారి గుర్తుగా దాచుకోవడానికి మాత్రమే. 


Also Read: UP Teacher: 'నేను తప్పు చేశాను, కానీ అందులో మతపరమైన విద్వేషమేమీ లేదు'


ఎన్టీఆర్ స్మారక నాణేలను తొలి విడతలో 12 వేలు తయారు చేశారు. అయితే ఎన్టీఆర్ కాయిన్ కు డిమాండ్ ఎక్కువగా ఉందని మింట్ అధికారులు చెబుతున్నారు. 50 వేల నాణేల వరకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డిమాండ్ ఎక్కువగా ఉండటం, నాణేలు తక్కువగా ఉండటం లాంటి సమస్య ఉందని.. భవిష్యత్తులో ఈ నాణేన్ని కోరుకున్న అందరికీ అందేలా తయారు చేస్తామని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ స్మారక నాణెం కావాలనుకునే వారు ఆన్‌లైన్‌ తో పాటు హైదరాబాద్ లోని 3 చోట్ల కొనుగోలు చేయవచ్చు. సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ తో పాటు చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద వీటిని అమ్మకానికి పెట్టారు. ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఎన్టీఆర్ స్మారక నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది. 
 
నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఆహ్వానం ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.