నిండు గర్భిణి.. పురిటినొప్పులతో ఇబ్బంది పడుతోంది. ఆస్పత్రికి వెళ్లాలంటే రోడ్డు మార్గం లేదు. వాగు దాటాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో వాగు దాటడం అపాయం. అయినా... తప్పని పరిస్థితి. ఓవైపు పురిటినొప్పులు... మరోవైపు ఆస్పత్రికి వెళ్లే దారిలేక అవస్థలు. ఈ పరిస్థితులో కుటుంబసభ్యులు నరకం చూశారు. ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలో తెలియక... ఆవేదన చెందారు. ఈతగాళ్లు... స్థానికుల సాయంతో... అతికష్టం మీద వాగు దాటించే ప్రయత్నం చేశారు. టైరుపై గర్భిణిని కూర్చోబెట్టి... నెమ్మదిగా వాగు దాటించారు. వాగు దాటుతున్నంత సేపు టెన్షనే... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... గర్భిణిని వాగు దాటించారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో జరిగింది.
ఎలిసెట్టి పెళ్లి... ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో మారుమూల గ్రామం. ఈ ఊరుకి రవాణా సౌకర్యం సరిగా లేదు. ఎందుకంటే జంపన్న వాగు అడ్డంగా ఉంది. ఊరు దాటాలంటే జంపన్న వాగు దాటాల్సిందే. మామూలు రోజుల్లో పర్వాలేదు.. ఎలాగోలాగా దాటేస్తారు. కానీ వర్షాలు పడి.. వాగు పొంగినప్పుడే.. వారికి కష్టాలు మొదలవుతాయి. వాగు పొంగితే... ఎలిసెట్టిపెళ్లి గ్రామానికి రాకపోకలు బంద్ అయినట్టే. ఆ సమయంలో... అత్యవసరంగా ఊరు దాటాలన్నా దారి ఉండదు. ప్రాణాలు ఫణంగా పెట్టి.. వాగు దాటాల్సిందే. గర్భిణీలు, వృద్ధులు... ఆ టైమ్‌లో నరకం చూస్తున్నారు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పొంగుతున్న వాగు దాటలేక... వారు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు.
ఇప్పుడు.. ఈ గర్భిణీ పడిన ఇబ్బందులు కూడా అవే. ఆమె పేరు దబ్బగట్ల సునీత. ఈమెకు ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే... రోడ్డుమార్గం లేదు. జంపన్న వాగు పొంగి పొర్లుతోంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో... గత ఈతగాళ్లు, స్థానికులు ఆమెకు సాయం చేశారు. టైరుపై ఆమెను కూర్చోబెట్టి.. వాగు దాటించారు. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రికి చేరే వరకు నరకం చూసిందా మహిళ. నిండు గర్భిణి.. టైర్‌పై కూర్చుని వాగు దాటడమంటే అంత ఈజీ కాదు. వాగు దాటుతున్నంత సేపు ఆమె పడిన బాధ వర్ణణాతీతం.
ఎలిశెట్టి పెళ్లి గ్రామానికి బ్రిడ్జి కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. అత్యవసర సమయాలలో ఊరు దాటాలంటే... తీవ్రఇబ్బందులు పడాల్సి వస్తుందని... తమ ఊరికి ఒక వంతెన మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. కానీ... పాలకులు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో.. వారి కష్టాలు అలానే ఉన్నాయి. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి మంజూరు చేయాలని కోరుతున్నారు ఎలిశెట్టి పెళ్లి గ్రామస్తులు.