Praja Sangrama Yatra: టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం టౌన్ కు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌కు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పించింది. అందులో భాగంగా ఖమ్మంలో కార్యకర్త సాయి గణేష్ సంతాప సభ నిర్వహించారు బీజేపీ నేతలు. సాయి గణేష్‌కు సంతాప సూచకంగా జూరాల ప్రాజెక్టుపై సెల్ ఫోన్ టార్చ్ లతో పాదయాత్ర నిర్వహించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. సాయి గణేష్ ఆత్మహత్య కారకులను వదిలిపెట్టే ప్రసక్త లేదని, తమ కార్యకర్తను వేధించిన వారి అంతు చూస్తాం అన్నారు. ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అవినీతి, అరాచకాల చిట్టా తమ వద్ద ఉందన్నారు బండి సంజయ్.
వనపర్తి జిల్లాలోకి ప్రజా సంగ్రామ యాత్ర..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ (BJP MP Bandi Sanjay Praja Sangrama Yatra) వనపర్తి జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి కాగడాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు గద్వాల జిల్లా చింత రేవుల గ్రామంలో పాదయాత్రలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సాయి గణేష్ సంతాప సభకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడారు.
అధికార టీఆర్ఎస్ నేతలు, అధికార నేతల అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా సాయి గణేష్ పోరాటం చేస్తుంటే, ఓర్వలేని నేతలు అతనిపై అక్రమంగా 16 కేసులు పెట్టి వేధించారు. రౌడీషీట్ ఓపెన్ చేస్తామని బెదిరించారని బండి సంజయ్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నీచమైన ఆలోచనలతో సాయి గణేష్‌ను పొట్టన పెట్టుకుంది. అతడి మరణానికి కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అన్ని పార్టీలు మారిన ఆ మంత్రి బీజేపీలోకి రావాలనుకుంటున్నారేమో... అది జరగని పని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, అక్రమాలు, నీచానికి పాల్పడే అలాంటి మంత్రిని బీజేపీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.
Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌కు కర్ణాటక రైతుల షాక్- కేసీఆర్ పథకాలు అమలు చేయాలని లేఖ
సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్
సాయి గణేష్ ఆత్మహత్యకు కారణాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సాయి గణేష్ సూసైడ్ కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సూసైడ్ కు ప్రేరేపించిన వారంతా నేరస్తులే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హత్యా రాజకీయాలను సీఎం కేసీఆర్ ప్రొత్సహిస్తున్నారని, సాయి గణేష్ మరణ వాంగ్మూలం తీసుకోకపోవడం వెనుక సీఎం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుట్ర దాగి ఉందని బండి సంజయ్ ఆరోపించారు.
న్యాయ స్థానంపైనే నమ్మకం
తమకు న్యాయ స్థానంపై నమ్మకం ఉందని, అందుకే సాయి గణేష్ ఆత్మహత్యపై న్యాయం కోంస కోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టు బీజేపీ నేతల పిటిషన్ ను స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఒక్క సాయి గణేష్ మరణిస్తే... వేల మంది సాయి గణేష్ లు పుట్టకొస్తారని, సాయి గణేష్ ఆశయాలను కొనసాగిస్తూ... టీఆర్ఎస్ అరాచకాలపై పోరాడతాం అన్నారు. ఖమ్మం జిల్లా అంతా కాషాయమయమైనప్పుడు సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.