తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని తరచూ టీఆర్‌ఎస్ నేతలు సవాల్ చేస్తుంటారు. తమ పథకాలు మెచ్చిన సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలిసిపోవాలని కోరుతున్నారంటూ కూడా సీఎం కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. ఇలాంటి సంఘటనే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌కు ఎదురైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం కొందరు రైతులు బండి సంజయ్ పాదయాత్రకు వచ్చారు. ఆయన్ను కలిసి ఓ లేఖ అందించారు. అది చదివిన తర్వాత బండి సంజయ్ కు వింత అనుభూతి ఎదురైంది.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో పాదయాత్ర
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల్ జిల్లాలో సాగుతోంది. ఎనిమిది రోజులుగా పర్యటిస్తున్న ఆయన... తెలంగాణ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ వర్గం ప్రజలకు కూడా అభివృద్ధి చెందలేదని రాష్ట్రాన్ని అదోగతి పాల్జేశారని మండిపడుతున్నారు. ఈ యాత్రలో ఉన్న బండి సంజయ్‌ను కలిసిన కర్నాటక వాసులు కొందరు ఆయన్ని సంకట పరిస్థితిలో పడేశారు. వారు చెప్పింది విన్న తర్వాత వాళ్లకు తిరిగి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వారి చెప్పింది వింటూ నవ్వుతూ ఉండిపోయారు.
తెలంగాణ పథకాలు అమలు చేయాలి
ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిసిన రాయ్‌చూర్ జిల్లా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవంటూ వాపోయారు. ఇది విన్న బండి సంజయ్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకర్షక పథకాలు అమలు అవుతున్నాయని చెప్పొకొచ్చారు రాయ్‌చూర్ వాసులు. ఇక్కడ అమలు అవుతున్న పథకాలు తమకు అందితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక్కడ అమలయ్యే కొన్ని పథకాలు కర్నాటలో కూడా అమలు చేసేలా అక్కడి బీజేపీ లీడర్లతో మాట్లాడాలంటూ రిక్వస్ట్ పెట్టుకున్నారు. రాయ్‌చూర్ ప్రజలు ఇచ్చిన వినతి పత్రం తీసుకున్న బండి సంజయ్.. వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇక్కడ మీరు అనుకున్నంత అద్భుతంగా పరిస్థితులు లేవని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.