కాంగ్రెస్ జన గర్జన సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలగజేస్తోందని మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మదమెక్కిన బీఆర్ఎస్ పార్టీ చెకింగ్ ల పేరుతో సభకు వచ్చేవారిని అడ్డుకుంటోందని అన్నారు. లారీలు, వ్యాన్ లను జూలురు పాడు వద్ద పోలీసులు నిలిపివేశారని అన్నారు. ఆటంకాలు సృష్టిస్తున్న ప్రభుత్వం, పోలీసులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం (జూలై 2) మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి సభను విఫలం చేయాలని చూస్తోందని పొంగులేటి ఆరోపించారు. లక్షలాది మంది జన గర్జన సభకు రావడానికి సిద్ధంగా ఉండగా.. వారు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రైవేటు వాహనాలను శివార్లలోనే చెకింగ్ ల పేరుతో అడ్డుకుంటున్నారని అన్నారు. మరికొన్నింటిని అనుమతి పత్రాల పేరుతో సీజ్ చేస్తున్నారని, ఇప్పటిదాకా దాదాపు 1700 వాహనాలు సీజ్ చేశారని అన్నారు. ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్నట్టుండి చెక్ పోస్టులు పెట్టి, పోలీసులు, ఆర్టీఏ అధికారులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారని అన్నారు. సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
‘‘కొందరు అధికారులు ప్రభుత్వానికి చెంచాలుగా పని చేస్తున్నారు. నేను కొద్దిసేపట్లోనే రోడ్డు మీదకు వస్తున్నాను. ఎవరూ ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు. తెలంగాణ తొలి ఉద్యమం ఖమ్మం నుంచే ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ పతనం ఈ సభ నుంచే ప్రారంభం అవుతుంది’’ అంటూ పొంగులేటి భావోద్వేగానికి గురైయ్యారు.
ఖమ్మం బయలుదేరిన రేవంత్ రెడ్డి
జన గర్జన సభలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ముందు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని సభాస్థలిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.