Telangana News: ఎన్నికల సమయంలో అన్నీ వివాదాస్పద అంశాలే. రాజకీయ పార్టీలు ( Political Parties ) అనుకోవాలే కానీ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టరు. తెలంగాణలనూ అంతే. దీపావళి పండుగకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఆ ఉత్తర్వులు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని బీజేపీ మండిపడే.. బీఆర్ఎస్ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
బహిరంగ ప్రదేశాల్లో టసాసులు కాల్చడంపై నిషేధం
బహిరంగ ప్రదేశాల్లో టపాసులు ( Crackers ) కాల్చడాన్ని నిషేధిస్తూ రాచకొండ పోలీసులు ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఆంక్షలు నవంబర్ 12 నుంచి 15 వరకు అమలులో ఉంటాయన్నారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చడానికి అవకాశం ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు నిబంధనలు, నిర్ణయించిన శబ్ధ కాలుష్యం పరిమితులకు లోబడి పటాకులు కాల్చి దీపావళిని జరుపుకోవాలని పోలీసులు ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ధ్వనిని విడుదల చేసే పటాకులు పేల్చడంపై పూర్తి నిషేధం ఉంది. ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌పై బీజేపీ విమర్శలు
ఈ ఉత్తర్వులను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీజేపీ .. హిందూ పండుగలకు ఆంక్షలు పెడుతున్నారని విమర్శలు గుప్పించింది. అధికారంలో కాగం్రెస్ ఉన్నా.. బీఆర్ఎస్ ఉన్నా ఇంతే ఉంటుందని మండిపడ్డారు.
గట్టిగా కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆదేశాలు ఇచ్చారని..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను బీఆర్ఎస్ పోస్టు చేసింది. ప్రతీ దానికి రాజకీయం చేయడం మతం రంగు పులమడం కరెక్ట్ కాదని సూచించింది. ఇలాంటి చీప్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు హర్షించరని .. విద్వేష రాజకీయాలపై వారెప్పుడూ అప్రమత్తంగా ఉంటారని బీఆర్ఎస్ తెలిపింది.
ఇవీ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
పండుగల సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. దీనిపై కొత్తగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది. 2018లో ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని స్పష్టం చేసింది. వాటిని కూడా దీపావళి వంటి పర్వదినాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే కాల్చుకోవచ్చని తెలిపింది.