Cylinder For One Rupee: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly 2023) ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం కోసం వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఓటర్లకు హామీలు ఇవ్వడంలోనూ రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ హామీలిచ్చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వరాల జల్లు కురిపిస్తున్నాయి.
సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (All India Forward Block Party) అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ యాదవ్ ( Kummari Venkatesh Yadav) ప్రజలకు ఊహించని హామీలిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను మించిపోయేలా రూపాయికే సిలిండర్ ఇస్తానన్నారు. ఇదే గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామంటూ కాంగ్రెస్, రూ.400లకే ఇస్తామంటూ గులాబీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాయి. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి మాత్రం రూపాయికే ఇస్తామని హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో
కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమాపేరుతో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమాను అందిస్తామిన గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా.. తొలి సంవత్సరంలో రూ.3,016కు పెంచుతారు. ఏటా రూ.500ల చొప్పున ఐదేళ్లలో రూ.5,016 ఇస్తారు. దివ్యాంగుల పింఛను తొలి ఏడాది రూ.5వేలకు పెంచుతూ... ఏటా రూ.300ల చొప్పున పెంచుకుంటూ పోయి 6వేల చేయనుంది. ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితి ₹15లక్షలకు పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు చొప్పున భృతి చెల్లింపు, అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తామని ప్రకటించింది. రైతు బంధు సాయం మొత్తాన్ని రూ.16వేలకు దశల వారీగా పెంపు. తొలి ఏడాది సాయాన్ని రూ.12వేల వరకు పెంపు. పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ తదితర పాలసీలన్నింటినీ యథాతథంగా కొనసాగింపు. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు.