Breaking News Telugu Live Updates: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం..

ABP Desam Last Updated: 12 Nov 2022 04:21 PM
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని మోదీ 

రామగుండంలో ప్రధాని మోదీ పర్యటించారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. రూ.6300 కోట్ల వ్యయంతో ఆర్ఎఫ్సీఎల్ ను పునరుద్ధరించారు. పలు అభివృద్ధి పనులకు ప్రధాని డిజిటల్ విధానంలో శంకుస్థాపన చేశారు. 

బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు విచ్చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. 

విశాఖ దేశంలోనే విశేషమైన నగరం: ప్రధాని మోదీ

తమ స్వభావంలో సౌమ్యులైన ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు.
కేవలం సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాదు.. తెలుగు ప్రజలకు స్నేహ శీలత సహద్భావం వల్లే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
తెలుగు ప్రజలు ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తపన పడతారు
ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం. విశాఖ దేశంలోనే విశేషమైన నగరం : ప్రధాని మోదీ

రూ. 10 వేల కోట్ల ప్రాజెక్టులతో ఏపీలో ఎంతో అభివృద్ధి : ప్రధాని మోదీ

విశాఖ నుంచి రోమ్ వరకు వర్తకం.. 
భారత దేశంలో విశాఖ ప్రత్యేకమైన నగరం అన్నారు. ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం అన్నారు ప్రధాని మోదీ. విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనదని, ఇక్కడి నుంచి రోమ్ వరకు వర్తకం జరిగేదని.. ఇప్పటికీ విశాఖ నగరం వ్యాపారం కేంద్రంగా కొనసాగుతోందన్నారు. రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులతో విశాఖ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన కీలక నేతలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరిబాబులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు ఎప్పుడు కలిసినా ఏపీ ప్రజల సంక్షేమం, డెవలప్‌మెంట్ గురించి చర్చించేవాళ్లమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో తమ విజన్ ఏంటన్నది, నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు తెలియజేస్తాయన్నారు ప్రధాని మోదీ. 

ఏపీ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు: ప్రధాని మోదీ

ఏపీ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ప్రజలు ప్రతిభ చూపి సత్తా చాటుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులు అందరికీ దోహదం చేస్తాయన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఏపీకి వచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

విశాఖలో జన సముద్రం కనిపిస్తోంది: ఏయూ సభలో సీఎం జగన్

విశాఖలో జన సముద్రం కనిపిస్తోంది: ఏయూ సభలో సీఎం జగన్
దేశ ప్రగి రథసారథి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం మొదలుపెట్టారు. వైజాగ్ లో రెండు సముద్రాలు కనిపిస్తున్నాయని, అందులో ఒకటి ఏయూలో జన సముద్రం కనిపిస్తుందన్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని, 8 ఏళ్ల కిందట అయిన గాయాలు ఇంకా మానలేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతి రూపాయిని వినియోగించామన్నారు. 

ఏయూ సభా వేదికకు ప్రధాని మోదీ, సీఎం జగన్

ఏయూ సభా వేదికకు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. ప్రధాని మోదీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. నేడు రెండు ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

ఏయూ గ్రౌండ్స్‌కు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజలు

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. మరికాసేపట్లో AU గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ, సీఎం జగన్ బహిరంగ సభ జరగనుండగా, భారీ సంఖ్యలో ప్రజలు ఈ సభలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. మద్దిలపాలెం, వాల్తేరు వైపు వెళ్లే అన్ని మార్గాల్లోనూ వాహనాలను దారిమళ్లించగా, నగరంలోకి భారీ వాహనాలు రాకుండా ఆంక్షలు విధించారు.


 



నేడు విశాఖలో పార్టీ ముఖ్యులతో జనసేన చీఫ్ పవన్ భేటీ !

నేడు విశాఖలోనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉంటనున్నారు. పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రితో పవన్ అరగంట పాటు భేటీ అయి రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులను వివరించారు. త్వరలోనే ఏపీకి ప్రయోజనం కలగనుందని, ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. రేపు విజయనగరంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

కిరణ్ రాయల్ అరెస్టు అప్రజాస్వామికం : జనసేన నేతల ఆగ్రహం

రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్‌ను అరెస్టు చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ ను అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరం అన్నారు నాదెండ్ల మనోహర్. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఏ కేసు పెట్టారో చెప్పకుండా, కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా అందర్నీ భయబ్రాంతులకు గురి చేసేలా ఇంటి తలుపులకు తాళాలు వేసి మరీ కిరణ్ రాయల్ ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడం దురదృష్టకరం అన్నారు. నగరి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగంగా చర్చించడానికి ముందుకు రావాలని మంత్రి రోజాకు తమ పార్టీ నేత కిరణ్ రాయల్ సవాల్ చేయడంతో... అప్పటి నుంచి కక్షగట్టిన మంత్రి జనసేన నాయకులు, వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం అన్నారు. 

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కి  నేడు ఎన్నికలు


68 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్


ఓటు హక్కు వినియోగించుకోనున్న 55 లక్షల మంది ఓటర్లు


ఓట్ల లెక్కింపు డిసెంబరు 8. బిజెపి, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య పోటీ


ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 67 కంపెనీల సిఎపిఎఫ్ బలగాలు, 15 కంపెనీల సిఆర్ఫీఎఫ్ బలగాలు 25 వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది వినియోగం.,


68 అసెంబ్లీ స్థానాలకు 2017లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 44, కాంగ్రెస్ 21 చోట్ల విజయం

Background

తిరుమలలో‌ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం 11-11-2022 రోజున 61,304 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 30,133 మంది తలనీలాలు సమర్పించగా, 3.46 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట క్యూలైన్స్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.


ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ, రోడ్ షో కారణంగా నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ నుంచి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి గానీ, త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి మద్దిలపాలెం ఏయూ ఆర్చ్  వైపు భద్రత కారణాలతో ఎటువంటి సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నేడు జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్‌తో కలిసి పరిశీలించారు. బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని  మంత్రులు తెలిపారు. 30 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.


ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాల దారి మళ్లింపు 
శనివారం నగరంలో ప్రముఖుల పర్యటనలు, వారి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు (నవంబర్ 12న) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖపట్నం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లే అన్నీ భారీ వాహనాలను ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపుగా మళ్లించనున్నారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్నీ రకాల భారీ వాహనాలను లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా మళ్లిస్తారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రధానంగా మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాలైన పెద్ద వాల్తేరు కురుపాం సర్కల్ నుండి త్రీ టౌన్ పోలీ స్టేషన్ వైపు, స్వర్ణ భారతి నుంచి మద్దిలపాలెం వైపు, మద్దిపాలెం నుండి పిఠాపురం, మంగాపురం కాలనీ వైపు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు.  


నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 9న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం నేడు పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకనుంది. రెగ్యూలర్ వెదర్ అంచనాలకు భిన్నంగా ఉత్తర శ్రీలంక - ఉత్తర తమిళనాడు కాకుండా చెన్నై - పుదుచ్చేరిల మధ్య తీరాన్ని తాకడం విశేషం. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి నేడు తీరం తాకుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం నేడు (12.11.2022) చెన్నై, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, వెల్లూరు మరియు కాంచీపురంలోని 6 జిల్లాల్లో పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవుదినంగా ప్రకటించింది.
 
ఆంధ్రప్రదేశ్‌ నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం తాకే అవకాశం ఉంది. భారీవర్షం వచ్చే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ హెచ్చరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.