ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 5వ తేదీన ప్రధాని హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆయన ఇక్రిశాట్‌ను సందర్శిస్తారు. అక్కడ ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించనున్నారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఈ రెండు సౌకర్యాలు ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలోని చిన్న రైతుల కోసం అంకితం చేస్తారు. ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను కూడా ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్మారక స్టాంపును కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ శంషాబాద్ దగ్గర్లోని ముచ్చింతల్‌ కు ప్రధాని వెళ్లనున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత దిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు. 



వీవీఐపీల పర్యటన షెడ్యూల్ 


ముచ్చింతల్​లోని చినజీయర్ స్వామి ఆశ్రమం శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను 14వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం 7 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో 



  • ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ 

  • 6వ తేదీన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 

  • 7న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ 

  • 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 

  • 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 

  • 13న రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. 
    పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. 


216 అడుగుల రామానుజుని విగ్రహం


రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలో శ్రీరామనగరంలో శ్రీమద్రామానుజాచార్య సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణాన్ని 2014లో ప్రారంభించారు. 45 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నాళ్లైనా చెక్కుచెదరని రీతిలో విగ్రహాన్ని రూపుదిద్దారు. విగ్రహ పీఠంతో సహా మొత్తం ఎత్తు 216 అడుగుల రామానుజుని విగ్రహం ఏర్పాటుచేశారు. అయితే రామానుజుని విగ్రహం ఎత్తు 108 అడుగులు కాగా పద్మపీఠం 27, భద్రవేదిక 54, త్రిదండం 135 అడుగుల ఎత్తులో ఉంటాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులుగా ఉంది. కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహంగా నిలవనుంది రామానుజుని ప్రతిమ. మొత్తం 1800 టన్నుల పంచలోహాలతో చైనాలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా హైదరాబాద్ కు తరలించారు. చైనా నిపుణులే వచ్చి వీటిని విగ్రహంగా మలచారు. రూ. వెయ్యి కోట్ల అంచనాతో ఆశ్రమాన్ని నిర్మించారు.