తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ సూచనలతో విద్యాశాఖ ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చింది. అయితే విద్యార్థులను పాఠశాలలకు పంపే నిర్ణయాన్ని తల్లిదండ్రులకు విడిచిపెట్టింది. తాజా విద్యాసంస్థల్లో బోధనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధన కొనసాగించాలని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని తెలిపింది. అంతేకాదు హైదరాబాద్ నగరంలోని మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


రెండు వారాల్లో పూర్తి నివేదిక 


కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అమలు, నిర్లక్ష్యం వద్దని సూచించింది. సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపింది. నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని హైకోర్టు అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాప్తిని తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. 


ఫిబ్రవరి 1 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు


ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలలు రీఓపెన్ అయ్యాయి. పాఠశాలల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. సంక్రాంతి సెలవుల తరువాత స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా మూడో దశ తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం సెలవులు పొడిగించింది. జనవరి 30వ తేదీ వరకూ సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ సారి అంత ప్రమాదకరం కాదని అలాగే తీవ్రత తగ్గుతున్న సూచనలు కూడా కనిపిస్తుండటంతో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ తరగతుల కొనసాగించాలని హైకోర్టు కూడా తాజాగా ఆదేశించింది. 


Also Read:  ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్..... తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం