అవినీతికి కాదేది అనర్హం అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు నిరూపించారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది తమకు వచ్చే జీతాలు సరిపోవడం లేదని పనుల కోసం వచ్చే వారి నుంచి తీసుకునే లంచాలు సరిపోవడం లేదని.. ఏకంగా పీఎఫ్ చందాదారుల వివరాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశారు. పీఎఫ్ చందాదారుల యూఏఎన్, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు అన్నీ ఇతరులకు అమ్మేశారు.
పీఎఫ్ చందాదారుల వివరాలు ఎవరికి అవసరం అంటే.. ప్రైవేటు పీఎఫ్ కన్సల్టెంట్లు, వ్యక్తులు వాటితో వ్యాపారం చేస్తూ ఉంటారు. వారికి డేటా ఎంతో ముఖ్యం. ఆ వివరాలు ఇస్తూ ప్రతిగా వారి నుంచి లంచాల రూపంలో అనుచిత లబ్ధి పొందారు. ఈ స్కామ్ చిన్నది కాదు.. చాలా పెద్దది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు కేంద్రంగా జరిగినట్లుగా సీబీఐకి ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు చేసి నిజాల్ని బయట పెట్టారు. నాలుగు వేర్వేరు కేసులను నమోదు చేసి 41 మందిని నిందితులుగా తేల్చారు. ఈపీఎఫ్‌వో ఉద్యోగులతో పాటు, కొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు పీఎఫ్ కన్సల్టెంట్లు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 40 చోట్ల నిందితుల నివాసాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించింది. పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.
సీబీఐ అధికారులు తనిఖీలు చేసి పీఎఫ్ అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులోని వివరాలు వారు ఎంత దారుణమైన కక్కుర్తికి అలవాటు పడ్డారో సాక్ష్యాలు బయటపడ్డాయి. ఖాతాదారులకు సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.. చాలా కొద్ది మొత్తంలో అంటే వందల్లో.. ఎక్కువ సమాచారం ఇస్తే నాలుగైదు వేల వరకూ లంచం తీసుకున్నారు. వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఫోన్లలో దొరికింది. గూగుల్, ఫోన్ ప్లే స్క్రీన్ షాట్లు కనిపించాయి. కవర్‌లో డబ్బులు పంపిను అందింది కదా అని కొంత అక్నాలెడ్జ్ మెంట్లు కూడా తీసుకున్నారు.
పీఎఫ్ ఆఫీసులు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అందుకే సీబీఐకి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ప్రకారం సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపింది. 2019 నవంబర్ 17 నుంచి 2021 ఫిబ్రవరి 3వ తేదీ మధ్య అవినీతి జరిగినట్లుగా సీబీఐ ఎఫ్ఆర్‌లలో తెలిపింది. పీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఈ స్కాం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇతర చోట్ల కూడా అలాగే చేసి ఉంటారని సమగ్రంగా విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సీబీఐ దృష్టి పెట్టే అవకాశం ఉంది .