కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది గురించి కూడా ఆదేశాల్లో పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే.. విధులకు హాజరుకావాలని ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ విద్యా సంస్థల విషయంలో ఇటీవలే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు జనవరి 16తో ముగిశాయి. అయితే అదేరోజు సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 24వ తేదీ నుంచి ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి.
తెలంగాణ కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి.. రోజురోజుకు పెరుగుతుంది. ఇవాళ 1,16,224 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. కొత్తగా 4,393 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 2,319 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 31,199 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు..
దేశంలో వరుసగా మూడు లక్షల కేసులు నమోదువుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3, 37, 704 మంది రోగాన బారిన పడ్డారు. నిన్నటితో పోలిస్తే మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గినట్టు తెలుస్తోంది.