Telangana Congress :   బంజారాహిల్స్‌లో యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్‌రూమ్‌పై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు.  కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు.. విలువైన డేటాతో పాటు కంప్యూటర్లు, లాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నారు.  ఇటీవల    ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ముఖ్యఅతిథిగా హాజరై హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. హైదారాబాద్ యూత్ డిక్లరేషన్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారానికి ప్రయత్నిస్తూంటే..  పోలీసులు తమ కంప్యూటర్లన్నింటినీ తీసుకెళ్లారని యువజన కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 


యువజన కాంగ్రెస్ పనితీరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌లో కూడా టెన్షన్ మొదలైందని, అందుకనే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని హస్తం నేతలు అంటున్నారు.  కేసీఆర్ దొంగ నాటకాలు యూత్ కాంగ్రెస్‌ను అడ్డుకోలేవని, పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాడులు చేయడం దుర్మార్గమని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి ఆరోపించారు.  ఆరోపించారు. లాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లడం చట్ట విరుద్ధమని ..కేసీఆర్ ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని తెలిపారు.                                                                            


అయితే అసలు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంపై ఫిర్యాదులు చేసింది టీ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో తమను కోవర్టులుగా చిత్రీకరిస్తూ.. ఇతర పార్టీల్లో చేరుతున్నట్లుగా కొంత మంది పోస్టర్లు వేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్జి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఫర్యాదు ఆధారంగానే  సోదాలు చేశామని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ సోషల్ మీడియా దాడులు.. కేసుల వ్యవహారంలో బీఆర్ఎస్‌లో సంచలనానికి కారణం అవుతోంది.                               


కొద్ది రోజుల కిందట మాదా పూర్‌లోని టీ కాంగ్రెస్ వార్‌రూమ్‌లో పోలీసులు దాడులు చేపట్టడం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్‌కు సునీల్ కనుగోలు వ్యూహకర్తగా పనిచేస్తోన్నారు. ఆయన ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని ఓ బిల్డింగ్‌లో కాంగ్రెస్ వార్‌రూమ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలతో కార్యాలయంలో తనిఖీలు చేశారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సునీల్ కనుగోలుతో పాటు పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అప్పట్లో హైకోర్టును టీ కాంగ్రెస్ ఆశ్రయించింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా కార్యాలయంపై దాడి జరగడం అనూహ్యంగా మారింది.