నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలోని జేజేరెడ్డి ఆసుపత్రి చౌరస్తాలో గల ప్రైవేట్ పిల్లల ఆస్పత్రి వైద్యుడికి వరుసకు సోదరుడు అర్జున్ అనే వ్యక్తి. అదే ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాడు. అదే ఆసుపత్రిలో పని చేస్తున్న యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి నమ్మించాడు. చెట్టపట్టా లేసుకొని తిరిగాడు అర్జున్. ఇటీవల యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో మోహం చాటేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
గత నెలలో వేరే యువతితో అర్జున్‌కు నిశ్చితార్థం జరిగినట్టు తెలిసిన బాధిత యువతి అతన్ని నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి అర్జున్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. దిక్కున చోట చెప్పుకోమని ఉచిత సలహా ఇచ్చేశాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పేశాడు.
అర్జున్ మోసానికి బలైపోయిన ఆ యువతి... స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ పెద్ద ఆసుపత్రిలో పని చేస్తున్న అర్జున్‌ను రక్షించేందుకు తెరవెనుక కొందరు ప్రయత్నించినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. అందుకే స్థానిక పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదట. దీంతో నేరుగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారామె. ఫిర్యాదు అందుకున్న సీపీ స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కేసు నమోదు చేసి అర్జున్‌ను అరెస్టు చేయాలని చెప్పారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో అర్జున్‌పై అత్యాచారం, చీటింగ్ కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు.