Kumuram Bheem Asifabad District News: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి మనుషులపై పడింది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పెద్ద పులి ఈ ఉదయం కాగజ్‌నగర్ మండలం గన్నారంలో మహిళపై అటాక్ చేసింది. పెద్దపులి దాడిలో ఆ మహిళ స్పాట్‌లోనే చనిపోయింది.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్‌లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పై పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన మొర్లే లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. పులి సంచారంతో కాగజ్నగర్ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇంకా ఎన్నాళ్లీ అలసత్వం: తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ
పెద్దపులి దాడిలో మహిళ చనిపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులి దాడికి ఇంకా ఎంత మంది ప్రాణాలు పోవాలి అంటూ అధికారులను నిలదీస్తున్నారు. మహిళ మృతిపై తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం పెద్దపులులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికే జిల్లాలో పులి దాడిలో ముగ్గురు మరణించారని, ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయారని గుర్తు చేశారు. అయిన ఫారెస్ట్ అధికారుల నుంచి ఎటువంటి చలనం లేకపోవడం బాధాకరం అన్నారు. జంతువుల ప్రాణాలకు ఇచ్చినటువంటి విలువ మనుషుల ప్రాణాలకు ఇవ్వడం లేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులిని వెంటనే బంధించి తడోబా పులుల సంరక్షణ ప్రాంతానికి తరలించాల్సిందిగా డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర తరహా పరిహారం ఇవ్వాలితెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ
పెద్దపులి దాడిలో మరణించిన మొర్లె లక్ష్మీ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మహారాష్ట్ర తరహాలో 15 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, 5 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Also Read: నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి కలకలం, కవ్వాల్ అభయారణ్యం నుంచి వచ్చినట్లు అనుమానం