Tiger In Adilabad District: నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా మామడ రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. మామడ రేంజ్ అధికారి రాథోడ్ అవినాష్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి పాదముద్రలు సేకరించారు. ఈ విషయమై ఏబిపి దేశం మామడ రేంజ్ అధికారి అవినాష్ తో ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పులి సంచారం వాస్తవమేనని వివరించారు. ఇది కవ్వాల్ అభయారణ్యం నుండి వచ్చిన పులి అని భావిస్తున్నారు.
నిర్మల్ రేంజి ప్రాంతం వైపు వెళ్లినట్లు అనుమానం
మామడ రేంజ్ పరిధిలోని సమీప గ్రామాల గుండా అది నిర్మల్ రేంజి ప్రాంతం వైపు దిమ్మదుర్తి ఏరియాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు. ఈ విషయమై నిర్మల్ రేంజ్ అధికారి రామకృష్ణను ఏబీపీ దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా... ఆయన పులి తమ రేంజ్ పరిధిలోకి వచ్చిందని, దిమ్మదూర్తి సమీప అటవి ప్రాంతంలో పులి సంచరిస్తుందన్నారు. పులి సంచారం నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తు, జాగ్రత్తగా ఉండాలని, అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికైతే పులి ఈ ప్రాంతంలోనే ఉంది. రేపటి వరకు అది నిర్మల్ మహబూబ్ ఘాట్ దిగి సారంగాపూర్ లేదా బోథ్ ఏరియా ప్రాంతాలకు వెళ్ళవచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చిన జానిపులి ఈ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్లను ఈ పులి దాని ఆనవాళ్లను గమనిస్తూ ఈ ప్రాంతం వైపు వెళుతుందని అనుకుంటున్నారు.
25 రోజులపాటు తిరిగిన జానీ పెద్ద పులి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొద్దిరోజులుగా పెద్ద పులులు సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వచ్చిన జానీ అనే పెద్ద పులి సుమారుగా 25 రోజులపాటు ఉమ్మడి జిల్లాలో సంచరించి, గ్రామాల మీదుగా తిరుగుతూ, తిరిగి మహారాష్ట్రలోని కోర్పణ మీదుగా తడోబా అటవీ ప్రాంతం వెైపు వెళ్లిపోయింది.
అటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి అడ్డేసారా, దేవాపూర్ మీదుగా అనార్ పల్లి ప్రాంతం వైపు కేరామేరీ రేంజ్ పరిధిలోకి వచ్చిందని సమాచారం. ఈ విషయమై కేరామెరి రేంజ్ అధికారి మజరుద్దిన్ ను abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. జోడేఘాట్ రేంజ్ నుండీ తమ కేరమెరి రేంజి పరిధిలోకి పులి వచ్చిందని, దేవాపూర్, అడ్డెసారా, అనార్పల్లి సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కల్పిస్తూ.. పులికి ఎలాంటి హాని తలపెట్టకుండా, రైతులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఎవరి పశువుల పైన పులి దాడి చేసినా, హతమార్చినా వాటికి తాత్కాలికంగా రూ.5000 , అలాగే పూర్తి పరిహారం వారంలోపు ఇచ్చే విధంగా అటవీ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. ప్రజలెవరూ భయాందోలనకు గురవద్దని, పులి అటవీ ప్రాంతం గుండా అది వెళ్లాలనుకున్న ప్రాంతానికి వెళ్ళిపోతుందన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలు గుంపులు గుంపులుగా ఉండాలని, ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల లోపే త్వరగా తమ పనులు ముగించుకోవాలన్నారు.
Also Read: Adilabad Tiger News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?